
ఉద్యోగి... విసిగి విసిగి
● దగాకోరు ‘కూటమి’పై పోరుబాట
● సమస్యలు పరిష్కరించాలని
ఉద్యోగుల డిమాండ్
● 25న విజయవాడలో
ఉపాధ్యాయుల ‘రణభేరి’ సభ
● విద్యుత్, సచివాలయ
సిబ్బంది నిరసన గళం
కొత్తపేట: వినీ విని విసిగిపోయారు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆక్రోశంతో ఉన్నారు.. ప్రజా పాలనలో ప్రభుత్వానికి చేదోడుగా ఉంటున్నా తమను పట్టించుకోవడం లేదంటూ నిరసన స్వరం వినిపిస్తున్నారు.. ప్రభుత్వ తీరుపై ప్రజలే కాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావొస్తున్నా ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంపై ఇప్పటికే విద్యార్థులు, రైతులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర శాఖల ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ శాఖ, సచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒక్కసారిగా నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు.
తమ శాఖాపరమైన సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యుత్ శాఖల యూనియన్లలో సుమారు 4 వేల మంది సమైఖ్యంగా నిలిచారు. ఈ నెల 15, 16 తేదీల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 17, 18 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసన, 19, 20 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 22న అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుత ర్యాలీ, కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రాలు సమర్పించనున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని హెచ్చరించారు.
డిమాండ్లు ఇవీ
● విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలి.
● రాష్ట్ర ప్రభుత్వంలో అమలులో ఉన్న జీపీఎఫ్‌తో కూడిన పెన్షన్ నిబంధనలను 1999 ఫిబ్రవరి 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు నియమితులైన ఉద్యోగులందరికీ వర్తింపజేయాలి.
● ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు యాజమాన్యమే నేరుగా వేతనాలు చెల్లించాలి.
● దీర్ఘకాలిక సర్వీసున్న వారందరినీ విద్యుత్ సంస్థలలో విలీనం చేయాలి. వారికి సంబంధించి మరో 4 డిమాండ్లు పరిష్కరించాలి.
● కారుణ్య నియామకాలు కల్పించడంలో కొత్త పేర్లు పెట్టి కన్సాలిడేటెడ్ పే ఇస్తున్న పద్ధతిని వెంటనే రద్దు చేసి, నాలుగు దశాబ్దాల నుంచి అమలులో ఉన్న పద్ధతినే కొనసాగించాలి. 2019లో నియమింపబడిన ఎనర్జీ అసిస్టెంట్లు (జేఎల్‌ఎం గ్రేడ్–2)లను రెగ్యులర్ జేఎల్‌ఎంలుగా పరిగణించి వేతనాలు, తదితర ప్రయోజనాలు కల్పించాలి. వాటితో సహా 17 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు.