
విక్రయానికి వైద్య విద్య!
● వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై
వెల్లువెత్తుతున్న నిరసనలు
● నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో
‘చలో మెడికల్ కాలేజ్’
● అమలాపురంలో ఇప్పటికే
నిలిచిన నిర్మాణ పనులు
● గత ప్రభుత్వ హయాంలో
కోనసీమ జిల్లాలో ప్రారంభం
● ప్రైవేటుకు అప్పగించాలని
తాజాగా కూటమి సర్కారు నిర్ణయం
సాక్షి, అమలాపురం: ప్రభుత్వ వైద్య విద్యను అంగడి సరకుగా మార్చాలనే కూటమి ప్రభుత్వ తీరుపై జిల్లావ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. సామాన్య, పేద, బడుగు వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే చంద్రబాబు మార్కు పీపీపీ విధానంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కోవిడ్ కష్టకాలంలో మారుమూల పల్లెల్లో వైద్యులు లేకపోవడం.. ఆస్పత్రుల్లో పడకల కొరతను గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ లక్ష్యానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచి దానిని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించింది.
జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల, దానికి అనుబంధంగా ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు రూ.500 కోట్లు కేటాయించి, వైద్య కళాశాలను మంజూరు చేసింది. అలాగే, అమలాపురం ఏరియా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయా లని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య అభ్యసించేవారి సంఖ్య పెరుగుతుంది. ప్రభు త్వం వైద్య విద్య వల్ల పేద, మధ్య తరగతి వారికి మేలు జరుగుతుందని గత ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రం అమలాపురానికి సమీపాన సమనస, చిందాడగరువు పరిధిలో కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేసింది. దీని నిర్మాణ పనులకు 2021లో అప్పటి సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.
గత ప్రభుత్వ హయాంలో కాలేజీ నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర నిర్మాణ పనులు సైతం అంతే చురుగ్గా జరిగాయి. కొన్ని భవనాలకు రెండు, నాలుగు అంతస్తులు సైతం నిర్మించారు. కాలేజీకి అనుబంధంగా అమలాపురం ఏరియా ఆసుపత్రిని బోధనాస్పత్రిగా విస్తరించాలని నిర్ణయించారు. వంద పడకల ఆస్పత్రిగా ఉన్న దీనిని తొలి దశలో 650 పడకలుగా, తరువాత మరింత విస్తరించి వెయ్యి పడకల ఆసుపత్రిగా మార్చాలని ప్రతిపాదించారు. దీంతో, అమలాపురంలో అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ జనరల్ అసుపత్రి అందుబాటులోకి వస్తుందని కోనసీమ వాసులు భావించారు. స్థానికంగా వంద పడకల ఏరియా ఆస్పత్రి, కిమ్స్ మెడికల్ కాలేజీలు ఆస్పత్రులు మాత్రమే పెద్దవి. మిగిలిన ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నా వాటిలో పడకల సంఖ్య చాలా తక్కువ. స్థానికులు ఎటువంటి వైద్యం చేయించుకోవాలన్నా కాకినాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సి వస్తోంది.
పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం
పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను, సామాన్యులకు ఉచిత వైద్యాన్ని దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ప్రైవేట్‌కు అప్పగించనుంది. దీనికి నిధుల కొరతను బూచిగా చూపిస్తోంది. ప్రైవేట్‌కు అప్పగించే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులపై నిర్లక్ష్యం చూపింది. ఏడాది క్రితం ఆ పనులు దాదాపు నిలిపివేసింది. అమలాపురం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు కూడా నిలిచిపోయాయి. దీనిపై స్థానిక సంస్థల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. నిర్మాణ సంస్థ చాలా వరకు నిర్మాణ సామగ్రిని పట్టుకుపోయింది.
నేడు చలో మెడికల్ కాలేజీ
వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకు పోతోంది. దీనిపై వైఎస్సార్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. దీనిలో భాగంగా అమలాపురంలో శుక్రవారం ‘చలో మెడికల్ కాలేజీ’ నిరసన చేపట్టనుంది. వైఎస్సార్ సీపీ క్యాడర్‌తో పాటు స్థానికులు, యువత, విద్యార్థులు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు.
అన్ని వర్గాలూ తరలిరావాలి
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణం. దీని వల్ల సామాన్యులకు వైద్యం, పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతాయి. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ‘చలో మెడికల్ కాలేజీ’ నిర్వహిస్తున్నాం. మెడికల్ కాలేజీ దగ్గరకు శాంతియుతంగా పెద్ద ఎత్తున వెళ్లి, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించనున్నాం. కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండల పార్టీల విభాగాలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గోనున్నారు.
– చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు
వారి త్యాగాలకు విలువేది?
కామనగరువు, చిందాడగరువు, రోళ్లపాలెం సరిహద్దులలో ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావించారు. ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం, రోడ్లు, ఇతర అవసరాల కోసం 52 ఎకరాల భూమిని సేకరించారు. అలాగే భూములు ఇచ్చిన రైతులు కూడా తమ పిల్లలు, కుటుంబ సభ్యులకు దీనిలో ఉద్యోగాలు కల్పిస్తారనే హామీలు పొందారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే స్థానికంగా ఉన్న కాలనీ వాసులు సైతం కాలేజీ ఏర్పాటు వల్ల ఇబ్బంది తప్పదని తెలిసి కూడా ప్రభుత్వ కళాశాల కావడంతో అంగీకరించారు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ‘రాజధాని అమరావతికి భూములు ఇచ్చినవారిని త్యాగమూర్తులు అన్న ప్రభుత్వం మా త్యాగాలను ఎందుకు గుర్తించడం లేదు’ అని ప్రశ్నిస్తున్నారు.

విక్రయానికి వైద్య విద్య!