పవన్‌ ఇలాకాలో యూరియా పక్కదారి | - | Sakshi
Sakshi News home page

పవన్‌ ఇలాకాలో యూరియా పక్కదారి

Sep 19 2025 2:05 AM | Updated on Sep 19 2025 2:05 AM

పవన్‌ ఇలాకాలో యూరియా పక్కదారి

పవన్‌ ఇలాకాలో యూరియా పక్కదారి

టీడీపీ నేత దుకాణం వద్ద డంపింగ్‌

బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మకాలు

అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు

లారీతో భారీగా యూరియా స్వాధీనం

కూటమి నేతలపై కేసులు

పిఠాపురం: అవసరమైనంత యూరియా అందుబాటులో ఉందంటూ అధికారుల ప్రకటనలు.. అందరికీ ఇస్తున్నా కావాలని రైతులు రాద్ధాంతం చేస్తున్నారంటూ టీడీపీ నేత బహిరంగ ప్రకటనలు.. తీరా చూస్తే యూరియా దొరక్క రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగడం.. నెల రోజులుగా ఇదే తంతు. ఇటువంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇలాకా పిఠాపురం నియోజకవర్గంలో రైతులకు అందాల్సిన యూరియాను కూటమి నేతలు పక్కదారి పట్టించి, రూ.లక్షలు వెనకేసుకుంటున్నారన్న నిజం బయటపడింది.

టీడీపీ నేత దుకాణానికి..

గొల్లప్రోలు మండల రైతులు కొన్ని రోజులుగా యూరి యా దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. ప్రతి నిత్యం సొసైటీలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. వచ్చిన యూరియా వచ్చినట్టే మాయమవుతూండటంతో వారికి అనుమానం వచ్చింది. దీనిపై ఆరా తీయగా యూరియా అంతా బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఓ టీడీపీ నేతకు చెందిన ఎరువుల దుకాణం వద్ద రెండు లారీల యూరియా డంపింగ్‌ చేస్తున్న విషయాన్ని గమనించి, ఆందోళనకు దిగారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. తాటిపర్తి గ్రామంలో రెండు రైతు సేవా కేంద్రాలున్నప్పటికీ వాటికి కాకుండా.. టీడీపీ నేత ఎరువుల దుకాణానికి మాత్రం ఇప్పటి వరకూ 12 లారీల్లో సుమారు 250 టన్నుల యూరియా ఇచ్చినట్లు తెలిసింది. విషయం బట్టబయలవడంతో గొల్లప్రోలు వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే ఆయా దుకా ణాలపై దాడులు నిర్వహించారు. అక్రమంగా యూరి యా తరలించి, రైతులకు ఎక్కువ ధరకు అమ్ముతూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నట్లు గుర్తించి, కేసులు నమోదుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన నియోజకవర్గ టీడీపీ నేత పైరవీలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. యూరియా అక్రమ దందాపై సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో విజిలెన్స్‌ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమ యూరియా అమ్మకాలను అడ్డుకుని రెండు లారీలను స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేశారు.

యూరియా బ్లాక్‌ మార్కెటింగ్‌పై కేసులు

విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల సమక్షంలో గొల్లప్రోలు మండల వ్యవసాయ అధికారి, రెవెన్యూ అధికారులు, పోలీసులు కలసి తాటిపర్తి గ్రామ శివారులోని చెరువు వద్ద నిర్వహించిన దాడుల్లో నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌కు చెందిన 548 బస్తాల యూరియా(24.660 మెట్రిక్‌ టన్నులు)తో ఉన్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై గురువారం రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ద్వారపూడి రైల్వే స్టేషన్‌లో వ్యాగన్‌ నుంచి శ్రీ నాగదుర్గ ఏజెన్సీస్‌ యజమాని దాసం శ్రీనివాస్‌, శ్రీ దుర్గా సరస్వతి ట్రేడర్స్‌ ప్రతినిధి ఉంగరాల వీరబాబు మొత్తం 450 యూరియా బస్తాలను దింపారని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌ చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. దాసం శ్రీనివాస్‌ సూచనల మేరకు 225 యూరియా బస్తాలను వన్నెపూడి గ్రామ శివారులో రోడ్డు పక్కన దింపారు. ఒక్కో రైతుకు 3, 4 బస్తాలు ఇచ్చి, మార్కెట్‌ ధర కంటే రూ.400, నుంచి రూ.500 వరకూ అధికంగా విక్రయించారు. ఈ క్రమంలో హెల్పర్‌ కనక వీరబాబు, శ్రీనివాస్‌ ఇచ్చిన ఈ–పోస్‌ యంత్రాన్ని ఉపయోగించి రైతుల వేలిముద్రలు సేకరించి, అధికారిక రికార్డుల్లో తప్పుడు పంపిణీ చూపించారని సీఐ చెప్పారు. దాసం శ్రీనివాస్‌ ద్వారపూడి స్టేషన్‌లో రైల్వే వ్యాగన్‌ నుంచి 450 బస్తాలు (20.250 మెట్రిక్‌ టన్నులు) లోడు చేసి, తాటిపర్తికి తరలించారని వివరించారు. వాటిలో 127 బస్తాలను ఆటోలు, బైకుల ద్వారా రైతులకు ఎక్కువ ధరకు విక్రయించారని, మిగిలిన 323 బస్తాలను తాటిపర్తి చెరువు పక్కన నిల్వ ఉంచగా, దాడి చేసి, లారీతో పాటు స్వాధీనం చేసుకున్నా మని తెలిపారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు దా సం శ్రీనివాస్‌ తనకు లభించిన యూరియా నిల్వలను లైసెన్స్‌ కలిగిన షాపు ద్వారా కాకుండా, గ్రామ శివార్లలో దింపి, రైతులకు అధిక ధరలకు బ్లాక్‌ మార్కెటింగ్‌ చేశారని చెప్పారు. అలాగే ఈ–పోస్‌ యంత్రాలను దుర్వినియోగం చేసి, రైతుల వేలిముద్రలను సేకరించి, తప్పుడు రికార్డులు సృష్టించారని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, ముద్దాయిలను పిఠాపురం కోర్టులో హాజరు పరిచామని చెప్పారు.

అధికారులపై అనుమానాలు

యూరియా కోసం కూపన్లు ఇచ్చి మరీ రైతులను గంటల తరబడి క్యూలో నిలబెట్టి, ఒకే ఒక్క బస్తా ఇస్తున్న అధికారులు.. టీడీపీ నేతకు లారీలకు లారీలతో యూరియా ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూరియా అక్రమ దందాలో అధికారుల వద్ద ఉండాల్సిన ఈ–పోస్‌ యంత్రాలు ఏకంగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిన విషయం విజిలెన్స్‌ విచారణలో బయటపడింది. ఇదే అదునుగా యూరియాను నకిలీ వేలిముద్రలతో యథేచ్ఛగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. టీడీపీ నేతలకు కొంతమంది అధికారులు సహకరించడం వల్లే ఈ దందా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement