
కాకి లెక్కలు
● అసాధారణ స్థాయిలో
పీహెచ్‌సీ సేవల గణాంకాలు
● జనాభాతో పొంతన లేకుండా సేవలు!
● ర్యాంకుల కోసమే తప్పుడు
లెక్కలని సందేహాలు
● 28 పీహెచ్‌సీలకు తాఖీదులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ)లో వైద్య సేవలపై ర్యాంకుల కోసం కాకి లెక్కలు తయారవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ర్యాంకుల కోసం కొన్ని పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది కుమ్మకై ్క ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తప్పుడు లెక్కలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పీహెచ్‌సీలు మెరుగైన ర్యాంకులు సాధించాలంటే అందుకు తగ్గట్టు ప్రజలకు నాణ్యమైన సేవలందించాలి. కానీ, ర్యాంకుల కోసం పీహెచ్‌సీల్లో అవుట్ పేషెంట్ (ఓపీ), ఇన్‌పేషెంట్ (ఐపీ), ల్యాబ్ టెస్ట్‌లు తదితర ఐదు రకాల సేవలపై అడ్డగోలుగా గణాంకాలు రూపొందిస్తున్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయా పీహెచ్‌సీలకు తాఖీదులు జారీ చేయడం సంచలనం రేపింది.
ఏం జరిగిందంటే..
వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారులకు, అక్కడి నుంచి క్షేత్ర స్థాయిలో పీహెచ్‌సీలకు వైద్య సేవలపై ప్రతి నెలా లక్ష్యాలు నిర్దేశిస్తూంటారు. ఈ లక్ష్య సాధనలో ర్యాంకులు దక్కించుకోవాలంటే పీహెచ్‌సీల్లో అందిస్తున్న సేవలపై రూపొందించే గణాంకాలే ప్రామాణికం. వీటిని కచ్చితంగా సాధించాలనే ఒత్తిళ్లు కూడా పై నుంచి ఉంటాయి. అయితే, పలు పీహెచ్‌సీల్లో ఆ గణాంకాలు వాస్తవానికి దూరంగా రూపొందిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో అపరిమితంగా నమోదైన వైద్య సేవలపై వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ వివరణలు కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ర్యాంకుల కోసం అడ్డదారులు
సాధారణంగా పీహెచ్‌సీల పరిధిలో జనాభా ఆధారంగా ప్రతి నెలా ఓపీ, ఐపీ సేవలు, ల్యాబ్‌లో ఎన్ని పరీక్షలు నిర్వహిస్తారనే అంచనాలు రూపొందిస్తూంటారు. ఐదేళ్ల కాలంలో ఈ గణాంకాలను సరాసరి అంచనా వేసి ర్యాంకులకు బెంచ్‌మార్క్ నిర్ణయిస్తారు. వీటి కంటే ఎక్కువ సంఖ్యలో సేవలందించే పీహెచ్‌సీలు, వైద్యులు, సిబ్బందికి ర్యాంకులు ఇస్తూంటారు. ఈ ర్యాంకుల కోసం కొన్ని పీహెచ్‌సీలలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. జిల్లావ్యాప్తంగా 40 పీహెచ్‌సీలు, 20 అర్బన్ పీహెచ్‌సీలు ఉన్నాయి. ఇవి కాకుండా పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, సామర్లకోట, జగ్గంపేట, శంఖవరం, రౌతులపూడి, పెదపూడిల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఉన్నాయి. వీటి ద్వారా గ్రామ, మండల స్థాయిల్లోని పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రాథమిక వైద్య సేవలందిస్తూంటారు. ఇలా అందించిన సేవలపై ప్రతి నెలా గణాంకాలతో కూడిన నివేదికలు పంపిస్తూంటారు.
సందేహం వచ్చిందిలా..
ఈ విధంగా 28 పీహెచ్‌సీల నుంచి అందిన ఓపీ, ఐపీ, ఇతర పరీక్షల నివేదికలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ గుర్తించారని తెలుస్తోంది. కొన్ని పీహెచ్‌సీల్లో రోజువారీ 100 నుంచి 150 ఓపీ కూడా ఉన్నట్టు నివేదికలు పంపించడంతో ఉన్నతాధికారులు సందేహించారు. వాస్తవానికి ఒక పీహెచ్‌సీలో ఒక్క రోజులో అంత ఓపీ సేవలు అసాధ్యమనే అభిప్రాయానికి వచ్చి, ఇదంతా ర్యాంకుల కోసం రూపొందించిన కాకి లెక్కల్లా ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. జనాభా ఆధారంగా పీహెచ్‌సీలకు వచ్చే రోగుల సంఖ్యను సుమారుగా నిర్ధారించవచ్చు. ఉదాహరణకు 50 వేల జనాభా ఉన్న పీహెచ్‌సీ పరిధిలో రోజుకు తక్కువలో తక్కువ 100 మంది రోగులు ఉంటారని అంచనా. అదే 20 వేల లోపు జనాభాఉన్న ఏవీ నగరం, పెరుమాళ్లపురం వంటి పీహెచ్‌సీలకు ఇందులో సగం మంది వస్తే గొప్పేనని అంటున్నారు. జనాభా ఎక్కువ, తక్కువతో సంబంధం లేకుండా పలు పీహెచ్‌సీల్లో 150 ఓపీ కూడా ఉన్నట్లు నివేదికలు పంపించడానికి ర్యాంకుల ఆరాటమే కారణమని చెబుతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో జిల్లా స్థాయి నుంచి లక్ష్యాలు సాధించాలనే ఒత్తిళ్లతోనే ఇలాంటి లెక్కలు పంపించాల్సి వస్తోందని పీహెచ్‌సీల్లోని వైద్యులు పేర్కొంటున్నారు.
వైద్యాధికారుల బాధ్యతారాహిత్యం!
ఇందులో వైద్యాధికారుల బాధ్యతారాహిత్యం కూడా లేకపోలేదనే విమర్శలు వస్తున్నాయి. పీహెచ్‌సీల్లో సేవలపై స్వయంగా వైద్యాధికారులే రిజిస్టర్లు నిర్వహించాలని చెబుతున్నారు. కానీ, ఆ బాధ్యతను కొందరు వైద్యాధికారులు సిబ్బందికి అప్పగించి చేతులు దులిపేసుకుంటున్నారని అంటున్నారు. అడపాదడపా ఉన్నతాధికారులు లేదా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలను సందర్శించే సందర్భంలో సమయానికి వైద్యులు వస్తున్నారా లేదా, ఓపీ రిజిస్టర్లు తయారు చేస్తున్నారా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు తప్ప వైద్యాధికారులు స్వయంగా వీటిని నిర్వహిస్తున్నారా లేదా అనేది పరిశీలించడం లేదని అంటున్నారు.
ఈ విషయంలో తప్పెవరిదైనా జిల్లాలోని 28 పీహెచ్‌సీల నుంచి వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వివరణలు కోరడం ఆ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. వీటిలో ఇప్పటి వరకూ 15 పీహెచ్‌సీల నుంచి మాత్రమే వివరణలు అందాయి. 13 పీహెచ్‌సీలు మాత్రం ఎటువంటి వివరణలూ పంపకుండా ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయంటూ ఉన్నతాధికారులు తాఖీదులు కూడా ఇచ్చారు. ఓపీ, ఐపీల సంఖ్య అసాధారణంగా ఉండటంపై మరోసారి పరిశీలన జరిపి, నివేదికలు పంపాలని ఆదేశించారు. పండూరు, ఏవీ నగరం, తూరంగి, వేట్లపాలెం, తొండంగి, దుగ్గుదూరు, విరవ, రాజపూడి, శంఖవరం, శాంతి ఆశ్రమం, కాట్రావులపల్లి, నాగులాపల్లి, గాడిమొగ పీహెచ్‌సీల్లో ఓపీ, ఐపీ లెక్కలు సరిచేసి పంపించాలని ఆదేశాలు వచ్చాయి.