
మూతపడే దుస్థితికి చేనేత సంఘాలు
రామచంద్రపురం రూరల్: చేనేత సహకార సంఘాల నిధులన్నీ ఆప్కో బకాయిల రూపంలో స్తంభించిన కారణంగా సభ్యులకు ఉపాధి కల్పించలేని దుస్థితికి సంఘాలు చేరుకున్నాయని లివరీ ఫెడరేషన్ చైర్మన్ దొంతంశెట్టి సత్య ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. హసన్‌బాద చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల లివరీ చేనేత సహకార సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన సత్య ప్రకాశ్ మాట్లాడుతూ గడిచిన 10 నెలలుగా బకాయిలు పేరుకు పోయాయన్నారు. బ్యాంకుల నుంచి మంజూరు కాబడిన నిధులు పూర్తిగా వినియోగించుకోలేక పోవడంతో సంఘాల బ్యాంకు ఖాతాలన్నీ ఎన్‌పీఏలోకి వెళుతున్నాయన్నారు. కొన్ని సంఘాలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆప్కోకు ఎన్నికలు నిర్వహించి గాడిన పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో హసన్‌బాద, ఆదివారపుపేట, శివల, అద్దంపల్లి, నేలటూరు, ముమ్మిడివరం, తమ్మవరం, మురారి, నల్లూరు తదితర చేనేత సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.