
పనితీరుతో ఉద్యోగులకు గుర్తింపు
● పంచాయతీరాజ్ కమిషనర్ ముత్యాలరాజు
● ఈటీసీలో ఎంపీడీఓల శిక్షణ పరిశీలన
సామర్లకోట: ఉద్యోగులు మంచి పనితీరుతో గుర్తింపు పొందవచ్చని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ కమిషనర్ రేవు ముత్యాలరావు అన్నారు. సామర్లకోటలోని విస్తరణ శిక్షణ కేంద్రానికి (ఈటీసీ) గురువారం ఆయన విచ్చేశారు. అక్కడ ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జల్లాల్లోని ఎంపీడీఓలకు జరుగుతున్న శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యాలరాజు మాట్లాడుతూ ప్రాధాన్యతాక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రతిచోటా ఎదురయ్యే సమస్యలను నైపుణ్యంతో సమర్థంగా అధిగమించాలన్నారు. అంతకు ముందు జరిగిన ఈటీసీ నిర్వహణ కమిటీ సమావేశానికి కమిషనర్ ముత్యాలరాజు అధ్యక్షత వహించారు. ఈటీసీలో జరుగుతున్న శిక్షణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ కావాల్సిన అవసరాలపై ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావును అడిగి తెలుసుకున్నారు. జీఎస్‌డబ్ల్యూ, వైద్యం, విద్య, ఇంజినీరింగ్ వంటి ఇతర శాఖల శిక్షణలు కూడా ఈటీసీలో జరిగేలా తీర్చిదిద్దాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. అనంతరం విస్తరణ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, జేఎన్‌టీయూకే ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్, డీడీఓలు శ్రీనివాస్, విజయ భాస్కర్, ఫ్యాకల్టీలు పాల్గొన్నారు.