
క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలు
● విద్యాశాఖ ఏఓ షరీఫ్ ● రాష్ట్ర స్థాయికి 106 మంది ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో రాణించే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఏఓ షరీఫ్ తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో గురువారం పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17 విభాగంలో క్రీడాకారుల ఎంపికలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌ఐ) కార్యదర్శి కనకాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ఏఓ షరీఫ్, గౌరవ అతిథులుగా రూరల్ ఎంఈఓ టీవీఎస్ రంగారావు, అర్బన్ ఎంఈఓ రవి హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను షరీఫ్, ఎస్‌జీఎఫ్‌ఐ జెండాను రవి ఆవిష్కరించారు. రూరల్ ఎంఈఓ టీవీఎస్ రంగారావు, చేయూత సంస్థ అధ్యక్షుడు రవి, హరీష్ స్పోర్ట్స్ అధినేత హరీష్, మాజీ ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి జార్జి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీను క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా స్థాయిలో అండర్ 14, 17 విభాగంలో ఆర్చరీ, ఘట్కా, సపక్ తక్రా క్రీడల్లో నిర్వహించిన ఎంపికలకు జిల్లా వ్యాప్తంగా 350 మంది హాజరయ్యారు. వీరి నుంచి రాష్ట్ర స్థాయికి 106 మందిని ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ఐ మాజీ కార్యదర్శి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి సునీల్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ కార్యవర్గ ప్రతినిధి మాచరరావు, ఆర్చరీ కోచ్ లక్ష్మణ్, మాజీ పీఈటీ సంఘ అధ్యక్షుడు రవిరాజు, పట్టాభి, గిరి, గాంధీ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఎంపికలను పాఠశాల క్రీడా సమాఖ్య సంయుక్త కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు.