
సంస్కృతుల వారధి.. సమైక్య సారథి
● దేశంలో హిందీ భాషకు ఎంతో ప్రాధాన్యం
● జాతీయ భాషగా గుర్తింపు
● ఈ నెల 14న జాతీయ హిందీ దివస్
రాయవరం: భారతదేశం వివిధ సంస్కృతులు, విభిన్న భాషలు, నాగరికతలకు నెలవు. ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకునేందుకు, మాట్లాడేందుకు భాష అవసరం. ప్రతి రాష్ట్రానికి ప్రాంతీయ భాష ఉంటుంది. దాదాపు 3,372 పైగా భాషలను దేశ ప్రజలు మాట్లాడుతుండగా, వాటిలో అధికారికంగా 24 భాషలను గుర్తించినప్పటికీ జాతీయ భాషగా హిందీని భావిస్తున్నాం. 1949లో భారత రాజ్యాంగ సభ హిందీని జాతీయ అధికారిక భాషగా గుర్తించింది. అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్ 14వ తేదీని హిందీ దివస్‌గా జరుపుకొంటున్నారు.
హిందీ నేపథ్యం
పర్షియన్ పదం ’హింద్ ’ నుంచి హిందీ పుట్టుకొచ్చింది. ఇండస్ నది పారుతున్న నేలలో మాట్లాడే భాష అని దీని అర్థం. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రెండు భాషల్లో హిందీ ఒకటి. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. దేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ నాలుగో స్థానంలో ఉంది. భారత్‌త్‌తో పాటు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, న్యూజిలాండ్, యూఏఈ, ఉగాండా, గయానా, ట్రినిడాడ్, మారిషస్, దక్షిణాఫ్రికాల్లో హిందీనిగణనీయ సంఖ్యలో మాట్లాడుతారు.
విశిష్ట సేవలు అందిస్తున్న ప్రచారక్‌లు
హిందీ భాషపై, ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగింది. ఫలితంగా అన్ని ప్రాంతాల్లో హిందీ ప్రచారక్‌లు ముందుకు వచ్చి హిందీ ప్రాథమిక స్థాయి పరీక్షల నుంచి ఉన్నత స్థాయి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి విద్యార్థులను తయారు చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు సైతం ఈ కోర్సులు పూర్తి చేసి, అనంతరం ప్రభుత్వ కొలువులు పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషలను జనాభాపరంగా పరిశీలిస్తే ఇంగ్లిషు, చైనా భాషల తర్వాతి స్థానం హిందీదే.
ఎంతో మందిని టీచర్లుగా తీర్చిదిద్దా
హిందీ భాష ద్వారా ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. దీన్ని నేర్చుకున్న చాలామంది దేశ, విదేశాల్లో ఉపాధి పొందారు. వందల మంది హిందీ ప్రచార సభ ద్వారా శిక్షణ పొంది హిందీ ఉపాధ్యాయులుగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నారు.
– మహ్మద్ అబ్దుల్ హమీద్, విశ్రాంత టీచర్, కేంద్ర వ్యవస్థాపక్, హిందీ ప్రచార సభ, మలికిపురం.
హిందీ పరీక్ష రాస్తున్న విద్యార్థులు
హిందీ భాషతో ఉపాధి
చాలా మంది పది, ఇంటర్ తరా్వాత హిందీ సబ్జెక్టుగా తీసుకుని డిగ్రీ చేస్తున్నారు. తర్వాత హిందీ పండిట్ శిక్షణ పొంది మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. హిందీ భాషకు సంబంధించి ప్రస్తుతం ట్యూషన్ సెంటర్లు ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా ఎంతో మందితో పరీక్షలు రాయిస్తున్నాను.
– పి.చిట్టి రుక్మిణి, విశ్రాత గ్రేడ్–1 హిందీ టీచర్, రామచంద్రపురం.
వారసత్వ సంపద
హిందీ భాష భారతీయులందరికీ వారసత్వ సంపద లాంటిది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఈ భాషకు ప్రాముఖ్యత ఉంది. ఈ భాషాభివృద్ధికి విద్యార్థి దశ నుంచే ప్రోత్సాహం అందించాలి. భాషపై ఏకాగ్రత ఉంచితే నేర్చుకోవడం చాలా సులభం.
– మద్దింశెట్టి రాంబాబు, హిందీ టీచర్, పసలపూడి, రాయవరం మండలం

సంస్కృతుల వారధి.. సమైక్య సారథి

సంస్కృతుల వారధి.. సమైక్య సారథి

సంస్కృతుల వారధి.. సమైక్య సారథి