
ఉచితమని నిర్లక్ష్యమా?
● ఆపకుండా వెళ్లిపోతున్న బస్సులు
● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు
గండేపల్లి: లబ్ధిదారులకు వినియోగపడని ఏ ప్రభుత్వ పథకమైనా వృథాయే. సూపర్ సిక్స్‌లో భాగంగా ఆర్భాటంగా ప్రారంభించిన సీ్త్రశక్తి ఉచిత బస్సు పథకం మహిళలకు చుక్కలు చూపిస్తోంది. గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షిస్తుంటే అవి రావడం ఆగకుండా పోవడం క్షణాల్లో జరిగిపోతున్నాయి. మండలంలోని నీలాద్రిరావుపేటకు చెందిన నక్కా అప్పలకొండ, దుర్గ, గౌరి, దోనాద్రి అచ్చియమ్మ, యెడల అచ్చమ్మ, తుపాకుల రాజమ్మాయి, సీంద్రపు కాసులమ్మ, కన్నాటి దుర్గ, దోనాదుల అచ్చమ్మ, తదితర మహిళలు గురువారం ఉదయం రాజమండ్రి వెళ్లేందుకు గ్రామంలో రహదారిపై వేచి ఉన్నారు. వీరంతా ఫ్రీ బస్సుకోసం ఎదురుచూస్తుండగానే బస్సులు రావడం, ఆగకుండా వెళ్లిపోవడం జరిగిపోయాయి. వాటిలో చాలా ఖాళీ ఉన్నా, ఆపమని చెయ్యి ఊపినప్పటికీ అవి వెళ్లిపోయాయని వివరించారు. ఉదయం సుమారు 8 గంటల నుంచి నిలబడి ఉన్నామని రెండు గంటలు నిలబడినా తమ ప్రయాణం ప్రారంభం కాలేదని వారు తెలిపారు. అసలే అరకొర బస్సులు ఆపై సమయపాలన పాటించవు.. ఈ పరిస్థితుల్లో తాము గమ్యస్థానాలకు ఎలా వెళ్లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
అక్రమ వ్యాపారాల
సమాచారం ఇవ్వండి
జిల్లా వాణిజ్య పన్నుల శాఖ జేసీ శ్రీలక్ష్మి
కాకినాడ రూరల్: జిల్లాలో అక్రమ వ్యాపార కార్యకలాపాలను ఎదుర్కొనడంలో వాణిజ్య పన్నుల శాఖ ప్రయత్నాలకు ప్రజలు, వర్తకులు, వర్తక సంఘాలు సహకరించాలని కాకినాడ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ డి.శ్రీలక్ష్మి విజ్జప్తి చేశారు. అక్రమ వ్యాపార కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు తమ శాఖ చీఫ్ కమిషనర్ కాకినాడ డివిజన్‌కు సంబంధించి వాట్సాప్ నెంబరు 87126 31287ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అక్రమ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి వివరాలను వాట్సాప్ నెంబరు ద్వారా తెలియజేయాలని జాయింట్ కమిషనర్ శ్రీలక్ష్మి కోరారు.
ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శులుగా సుధారాణి, శ్రీను
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య సంయుక్త కార్యదర్శులుగా జిల్లాకు చెందిన సీనియర్ పీడీలు కనకాల శ్రీనివాసరావు, పి.సుధారాణి నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయరామరాజు నుంచి నియామక పత్రాలు అందుకున్నారు. కనకాల శ్రీనివాసరావు వేళంగి జెడ్పీ పాఠశాలలో పీడీగా పనిచేస్తున్నారు. 2012–13 సంవత్సరంలో కూడా ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి పరిఽధిలో ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శిగా పనిచేశారు. సుధారాణి సామర్లకోట మండలం పీఎం శ్రీ ఎంపీఎల్ పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ 2025–26 సంవత్సరానికి ఏజీఎఫ్‌ఐ కార్యదర్శులుగా వ్యవహరిస్తారు. గతంలో జిల్లాకు ఒకరే ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శిగా పనిచేసేవారు. కానీ ఈ ఏడాది మారిన నిబంధనల ప్రకారం పాఠశాల విద్యాశాఖ బాలురకు వేరుగా, బాలికలకు వేరుగా కార్యదర్శులను నియమించడంతో జిల్లా నుంచి వీరు ఇరువురికి అవకాశం లభించింది. నూతన కార్యదర్శులను మాజీ కార్యదర్శి ఎల్.జార్జి, సంయుక్త కార్యదర్శి సునీల్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీను, సీనియర్ పీడీలు రంగారావు, రవిరాజు, పట్టాభి, మాచరరావు, ప్రసాద్, గిరి గురువారం అభినందించారు.
నేడు ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రబీలో ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం 10.15 గంటలకు కలెక్టరేట్‌లో ఐదు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల జాయింట్ కలెక్టర్‌లు, పౌర సరఫరాశాఖ అధికారులు పాల్గొననున్నారు.

ఉచితమని నిర్లక్ష్యమా?