
కూటమిలో లాఠీ లడాయి!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమిలోని రెండు పార్టీల మధ్య సర్కిల్ వార్ నడుస్తోంది. ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కోసం ఇరుపార్టీల ప్రధాన నేతలు పంతం నెగ్గించుకోవాలని పట్టుబడుతున్నారు. ఒక పార్టీ నేతలు సీఐను సాగనంపాలని మరో పార్టీ నేతలు కొనసాగించాలని పంతానికి పోతున్నారు. ఈ పరిణామం కూటమి నేతల మధ్య పెద్ద వివాదానికి తెరలేపింది. ఈ తగాదా చివరకు చినబాబు దగ్గరకు చేరి కాకినాడ కూటమిలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. గడచిన వారం రోజులుగా సర్కిల్ ఇనస్పెక్టర్ వ్యవహారం కూటమిలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రాద్ధాంతానికి ముఖ్య కారణం ప్రధానమంత్రి మోదీ తల్లిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ చేసినట్టుగా చెప్తున్న వ్యాఖ్యలే కావడం విశేషం. రాహుల్ వ్యాఖ్యలపై కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, యార్లగడ్డ రామ్‌కుమార్, జ్యోతుల రాజేష్, చెక్కా రమేష్ తదితర నేతల ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ధర్నాకు, రాహుల్ దిష్టిబొమ్మ దహనానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసి మూడో పట్టణ పోలీసు స్టేషన్ నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణతో పాటు ఎస్సైలు, పోలీసులు కాంగ్రెస్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలను అడ్డుకోవడం కమలనాథుల ఆగ్రహానికి కారణమైంది. రాహుల్ దిష్టిబొమ్మ దహనం చేయవద్దని పోలీసులు కట్టడి చేయడం కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆ పార్టీ నేతలు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోయారు. అధికారంలో భాగస్వామ్యులమైన తమపైనే దురుసుగా ప్రవర్తిస్తారా, లాఠీలు ఝుళిపిస్తారా అంటూ స్వయంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు తదితర నేతలు ఆగ్రహంతో ఊగిపోతూ సీఐ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందేనని, ఇక్కడి నుంచి సాగనంపాల్సిందేనని ఆందోళనకు దిగారు. దీంతో ఈ వివాదం కాస్తా రోడ్డెక్కింది. పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కోసం కాకినాడ జీజీహెచ్‌కు వెళితే పోలీసులు ఏ మాత్రం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కమలనాథులు తమ పార్టీకి చెందిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా పార్టీ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారమంటూ సీఐపై చర్యలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రి జోక్యంతో చివరకు పోలీసులు లాఠీచార్జిలో గాయాల పాలైనట్టుగా చెబుతున్న ఆరుగురు పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ చేయక తప్పలేదు.
ఎమ్మెల్సీ చేయించడంతో సీఐతో సహా పలువురు పోలీసులపై ఫిర్యాదు చేయడం ద్వారా త్రీటౌన్ సీఐను సాగనంపే విషయంలో వెనక్కు తగ్గేది లేదని బీజేపీ నేతలు తెగేసి చెప్పినట్టయ్యింది. అతన్ని బదిలీ చేయాల్సిందేనని ఆ పార్టీ అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చారు. సీఐను బదిలీచేస్తారో, వీఆర్‌కు పంపిస్తారో ఏదో ఒకటి చేయకుంటే కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేనని, పార్టీని వీడాల్సి వస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ద్వారా మంత్రి సత్యకుమార్ దృష్టికితీసుకు వెళ్లడంతో అది కాస్తా చినబాబు పంచాయతీకి వెళ్లింది. ఇంతలో సీఐకు ఇక్కడ పోిస్టింగ్ రావడంలో క్రియాశీలకంగా వ్యహరించిన టీడీపీ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) వర్గీయులు ఇక్కడి నుంచి పంపవద్దని పోలీసు ఉన్నతాధికారుల వద్ద పట్టుబట్టడంతో ఇరుపార్టీ నేతల మధ్య వివాదం ముదిరి పాకానపడింది. ఇరు పార్టీల నేతలతో ఒక పోలీసు అధికారి మాట్లాడి సీఐను వీఆర్‌కు పంపిస్తామని, కొంత సమయం ఇవ్వాలని పార్టీ నేతలకు నచ్చచెప్పే ప్రయత్నంచేశారు. ఇందుకు బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన సానుకూలత వ్యక్తం చేయడంతో సమస్య పరిష్కారమైందని అంతా అనుకున్నారు. తీరా ఎమ్మెల్యే అనుచరుగణం మద్దతు ఉండటంతోనే సీఐపై చర్యలకు పోలీసు అధికారులు వెనుకాడుతున్నారనే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ నేతలు మరోసారి రచ్చచేసేందుకు సమాయత్తమవుతున్నారు. బహిరంగంగా బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసి గాయాలపాలైనా చర్యలు లేవంటే పార్టీ కార్యక్రమాలకు బయట తిరగలేమని ఆ నేతలు ఆ పార్టీ రాష్ట్ర నేతల వద్ద పెట్టడంతో చర్యలకు సిఫార్సు చేశారంటున్నారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి మౌఖికంగా ఆదేశాలు వచ్చినప్పటికీ జిల్లా స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుతగులుతున్నారని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుంటామని కమలనాథులు గట్టిపట్టుబడుతున్నారు.
సీఐ వివాదం ఇంకా కొలిక్కి రాకుండానే కూటమిలోని టీడీపీ, బీజేపీ నేతల మధ్య రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. కాకినాడ గాంధీనగర్ 40వ డివిజన్‌లో టీడీపీ నేతలు లేకుండా బీజేీపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన, మాజీ అధ్యక్షుడు మాలకొండయ్య, ఆ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి తదితరులు స్మార్ట్ కార్డులను ఇటీవల పంపిణీ చేయడాన్ని టీడీపీ తీవ్రంగా పరిగణించింది. తమ పార్టీ నేతలు లేకుండా స్మార్ట్ కార్డులు ఎలా పంపిణీ చేస్తారని టీడీపీ నేతలు పౌరసరఫరాల అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి రేషన్ డీలర్‌ను సస్పెండ్ చేయించారు. బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నాయనే సాకుతో రేషన్ డిపోపై 6ఎ కేసు నమోదుచేయించి రేషన్‌షాపును తెరవకుండా టీడీపీకి చెందిన జొన్నాడ వెంకటరమణ తదితరులు తాళం వేయించారని బీజేపీ నేతలు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. టీడీపీ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో రేషన్ షాపును సీజ్ చేస్తారా అంటూ బీజేపీ నేతలు పౌరసరఫరాల అధికారులను నిలదీయడంతో చివరకు రేషన్ షాపునకు తిరిగి అనుమతించారు. ఇలా టీడీపీ, బీజేపీ నేతల మధ్య కోల్డ్‌వార్ రచ్చరచ్చ అవుతోంది.
త్రీటౌన్ సీఐ సత్యనారాయణను సాగనంపాలని
డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు
కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఈ నెల ఒకటిన ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు, కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు
బీజేపీ కార్యకర్తలపై సీఐ జులుం
అతనికి అండగా ‘కొండ’ంత బలం
ఆయన బదిలీకి కమలనాథుల పట్టు
చినబాబు చెంతకు పంచాయితీ
కాకినాడలో కాక రేపుతున్న రచ్చ

కూటమిలో లాఠీ లడాయి!

కూటమిలో లాఠీ లడాయి!