
జీవితాలతో ఆటోలాడొద్దు..
సాక్షి, అమలాపురం: జీవితాలతో ఆటలాడుతున్నారు.. సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి బ్రేక్‌లు వేశారు.. ఆటో కార్మికుల జీవితాలను కుదిపేశారు.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా, రోజువారీ ఆదాయానికి గండి పెట్టడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీ్త్ర శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో రోడ్డున పడ్డామని ఆటో కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఆదాయం సగానికి పడిపోవడంతో పాటు పెరిగిపోతున్న ఫైనాన్స్ భారాన్ని మోయలేక రోడ్డెక్కారు. దశల వారీగా ఆందోళనలకు సిద్ధమయ్యారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆటో కార్మికుల ఆందోళనలు ఉధృతం చేశారు. ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం తీసుకు వచ్చిన తరువాత కార్మికుల రోజువారీ ఆదాయానికి భారీగా గండి పడింది. గతంలో రోజుకు రూ.వెయ్యి వరకూ ఆదాయం చూసిన కార్మికులకు ఇప్పుడు రూ.300 నుంచి రూ.500 కూడా రావడం లేదు. దీనితో జిల్లాలో సుమారు 25 వేలకు మందికి పైగా ఉన్న కార్మికుల జీవనోపాధికి గండి పడినట్టయ్యింది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కొంత వరకూ సర్వీసు ఉంది. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు వెళ్లని గ్రామాలకు వెళ్లే ఆటో కార్మికులకు వచ్చే ఆదాయం పెద్దగా తగ్గలేదు. ఉదాహరణకు అమలాపురం నుంచి ఉప్పలగుప్తం మీదుగా ఎన్.కొత్తపల్లి, కూనవరం, అమలాపురం మండలం సాకుర్రు, అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం, ఐ.పోలవరం మండల కేంద్రానికి, మురమళ్ల నుంచి టి.కొత్తపల్లి, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, లంకాఫ్ ఠాణేల్లంక, మలికిపురం మండలం అప్పనరామునిలంక, గుడిమెల్లంక వంటి బస్సు సర్వీసులు లేనిచోట ఆటో కార్మికులకు పెద్దగా ఇబ్బంది లేదు. ఒకటి, రెండు బస్సు సర్వీసులు ఉన్నచోట కొంత వరకూ ఆదాయం తగ్గగా, అధిక సర్వీసులు తిరిగే అమలాపురం నుంచి రావులపాలెం, రావులపాలెం మీదుగా బొబ్బర్లంక, వాడపల్లి, రాజోలు నుంచి అమలాపురం, రాజోలు నుంచి పి.గన్నవరం మీదుగా రావులపాలెం, అమలాపురం నుంచి ముమ్మిడివరం, మురమళ్ల మీదుగా యానాం, అమలాపురం నుంచి ముక్తేశ్వరం, అమలాపురం నుంచి కాట్రేనికోన, అమలాపురం నుంచి అల్లవరం, యానాం నుంచి రామచంద్రపురం, మండపేట మీదుగా రావులపాలెం వంటి బస్సులు అధికంగా తిరిగే రూట్లలో ఆటో కార్మికుల ఉపాధి మూడొంతులు పడిపోయింది. అమలాపురం బస్టాండ్ నుంచి రావులపాలెం బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆటో సర్వీసులు దాదాపు నిలిపివేశామని కార్మికులు చెబుతున్నారు. ఇదే సమయంలో తనిఖీలు, ఫిట్‌నెస్, పొల్యూషన్ పేరుతో ఎడాపెడా ఫైన్లు రాస్తుండడంతో వారి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. దీనిని అమలాపురం మండలం ఎ.వేమవరంలో ఏర్పాటు చేశారు. జిల్లాకు ఇదొక్కటే కావడంతో రామచంద్రపురం, మండపేట, ఆత్రేయపురం, సఖినేటిపల్లి వంటి సుదూర మండలాల నుంచి ఇక్కడకు వచ్చి సర్టిఫికెట్ పొందడం కూడా వారికి భారంగా మారింది.
ప్రభుత్వం పట్టించుకోక..
ప్రధాన మార్గాల్లో ఆదాయం కోల్పోవడం ఆటో కార్మికుల రోజువారీ జీవనానికి సైతం కష్టాలు వచ్చాయి. ఇతర మార్గాల్లో ఆటోలు తిప్పుతుంటే ఇతర కార్మికుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. నిత్యం సర్వీసులు తిరిగే మార్గాల్లో ఆదాయం లేకుండా పోయింది. అన్ని ఖర్చులూ పోను రోజుకు రూ.వెయ్యి వరకు ఆదాయం వచ్చేచోట ఇప్పుడు రూ.మూడు వందలు కూడా రావడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. దీనితో వారు నిరసన బాట పట్టారు. ఇప్పటికే జిల్లాలో దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టారు. ఆటోలకు నల్ల జెండాలు కట్టి నిరసన తెలుపుతున్నారు. మండలాల వారీగా రాస్తారోకోలు, ధర్నాలు, ఆటోలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేనందున ఈ నెల 12, 13వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించాలని నిర్ణయించారు.
హామీ.. పట్టదేమీ!
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో కార్మికులకు ఏడాదికి రూ.10 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేది. దీనివల్ల జిల్లాలో వేలాది మంది కార్మికులు రూ.కోట్ల మేర లబ్ధి పొందారు. ఆటో మరమ్మతులు, రోడ్ ట్యాక్స్, ఇతర అవసరాల కోసం వినియోగించుకునేవారు. తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికునికి ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని టీడీపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఎన్నికల సభలో తాము ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఆ ఊసెత్తడం లేదు. ఈ ఏడాదితో కలిపి ఒక్క ఆటో కార్మికునికి రూ.30 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంది. అదీ ఇవ్వక, వచ్చే ఆదాయ మార్గం లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
సీ్త్ర శక్తి పథకంతో రోడ్డున పడిన కార్మికులు
నిరసిస్తూ రేపు, ఎల్లుండి ఆటోల బంద్
ఎన్నికల హామీని
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
ఏడాదికి రూ.15 వేలు ఎప్పటికి ఇస్తారో!