
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో కాకినాడ జిల్లాకు చెందిన పలువురికి చోటు కల్పించారు. వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కాకినాడ సిటీ నియోజవర్గానికి చెందిన పెద్ది రత్నాజీని, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పిఠాపురం నియోజవర్గానికి చెందిన ఓరుగంటి చక్రధరుడు ( చక్రి), రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా జ్యోతుల వెంకట రాజు (బాబులు), రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శిగా జవ్వాది కృష్ణమాధవరావును నియమించారు.
వినియోగంలోకి
ఇంక్యుబేషన్ సెంటర్
కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ రూరల్: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం త్వరలో ఇంక్యుబేషన్ సెంటరును వినియోగంలోకి తీసుకురానున్నట్టు కలెక్టరు షణ్మోహన్ పేర్కొన్నారు. సర్పవరం ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్కు ఆటోనగర్‌లోని ఐటీ సెజ్‌ను బుధవారం ఆయన సందర్శించారు. నిరుపయోగంగా ఉన్న ఇంక్యుబేషన్ టవర్‌ను పరిశీలించి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ఏపీఐఐసీ జోనల్ మేనేజరు రమణారెడ్డి, ఇతర అధికారులతో చర్చించారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై చర్చించి, తక్షణం తీసుకోవల్సిన చర్యలపై మాట్లాడారు. పారిశ్రామిక వేత్తలు, నిరుద్యోగులకు ఉపయోగపడేలా ఈ టవర్‌ను వినియోగంలోకి తీసుకువస్తామన్నారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ
విరమించుకోవాలి
మలికిపురం: వైద్య కళాశాలలు ప్రైవేట్‌పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షు డు బూశి జాన్‌మోషే డిమాండ్ చేశారు. బు ధవారం ఆయన మలికిపురంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వైద్య విద్యను దూరం చేయడానికి వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో బహుజన విద్యార్థులకు తీవ్ర అన్యా యం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకువచ్చిన పీపీపీ విధానం ఆయన సామాజిక వర్గానికి ప్రయోజనంగా ఉందే తప్ప, దీనివల్ల బహుజనులకు ప్రయోజనం లేదన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేట్ పరిధిలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు మెడికల్ సీట్లను కోట్లాది రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తుంటారని, తను క్యాబినెట్‌లో ఉన్న మంత్రి నారాయణ విద్యా సంస్థలు నడుపుతున్నవారికి మెడికల్ కళాశాలను ధారాద త్తం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందన్నారు.
శనైశ్చరుని
హుండీ ఆదాయం లెక్కింపు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన కొత్తపేట మండలం మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారి దేవస్థానంలో హుండీల ద్వారా రూ 10,06,005 ఆదాయం వచ్చినట్టు దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు తెలిపారు. జిల్లా దేవదాయ శాఖ అధికారి, సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ, దేవదాయ శాఖ అమలాపురం, రాజమహేంద్రవరం ఇన్‌స్పెక్టర్ టీవీఎస్‌ఆర్ ప్రసాద్ పర్యవేక్షణలో ఈఓ సురేష్‌బాబు ఆధ్వర్యంలో బుధవారం హుండీలను తెరిచారు. వారి సమక్షంలో దేవస్థానం సిబ్బంది, భక్తులు, స్థానికులు నగదును లెక్కించారు. 8 నెలల 11 రోజులకు హుండీ ద్వారా రూ.8,80,131, అన్నప్రసాద ట్రస్ట్‌కు రూ.85,357, దేవస్థానం క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి ఆలయం హుండీ ద్వారా రూ.40,517 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. మందపల్లి ఎంపీటీసీ సభ్యుడు సిద్దంశెట్టి వీవీ సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ నాయకుడు సాదు చెంచయ్య, గ్రామ కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు