
అశ్వత్థానికి దీపపుసెగ
● నల్లగా మాడిపోతున్న రావిచెట్టు మాను
● మొదలులో తీవ్రంగా వేడెక్కిపోతున్న వైనం
● రక్షణ చర్యలు అవశ్యం
అన్నవరం: రత్నగిరికి వచ్చే భక్తుల అనాలోచిత చర్యలు ఆలయ ఆవరణలోని త్రిమూర్తి స్వరూపమైన భారీ అశ్వత్థ వృక్షానికి (రావిచెట్టు) చేటు చేస్తున్నాయి. ఆలయ ఆవరణలో సుమారు 50 ఏళ్లు పైబడిన ఉన్న ఆ వృక్షం చుట్టూ భక్తులు అవునేతితో దీపాలు పెట్టి ప్రదక్షిణలు చేస్తుంటారు. నిత్యం తెల్లవారు ఝాము నుంచి సాయంత్రం వరకు సాధారణ రోజుల్లో ఐదు వేల నుంచీ పర్వదినాల్లో 25 వేలకు పైబడి దీపాలు ఆ వృక్షం చుట్టూ వెలిగిస్తుంటారు. దీంతో సాధారణంగానే ఆ చెట్టు మాను తీవ్రంగా వేడెక్కిపోతుంది. ఈ నేపథ్యంలో దీపాలను ఆ వృక్షానికి ఇబ్బంది లేనంత దూరంలో వెలిగించుకునే ఏర్పాట్లను అధికారులు చేయాల్సి ఉంది.
గతంలో మాను చుట్టూ రేకు ఏర్పాటు
గతంలో దీపాల సెగ వృక్షం మానుకు తగలకుండా చుట్టూ రేకు అమర్చేవారు. అలాగే మాను మొదట్లో నీరు పోసి తడిపే వారు. ఇప్పుడు ఆ చర్యలేమీ లేవు. ఇప్పటికై నా ఆ చర్యలను పునరావృతం చేసి మానుకు వేడి తగలకుండా రక్షణ కంచె ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే దీపాలు కొండెక్కాక వాటిని అక్కడి నుంచి తొలగిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది.
దీపాల ద్వారా ఆదాయం
రత్నగిరిపై ఉన్న దేవతా స్వరూపంగా అలరారుతున్న రావి వృక్షానికి దీపారాధన చేస్తే మంచి జరుగుతుందని ఆలయ వర్గాలు ప్రచారం చేస్తుంటాయి. దీంతో భక్తులు దీపాలు, ఆవునెయ్యి కొనుగోలు చేయడం ద్వారా దేవస్థానానికి రూ.1.5 కోట్ల ఆదాయం వస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయా దుకాణదారులు సైతం దీపాలను ఆ వృక్షానికి దూరంగా పెట్టాలని భక్తులకు సూచించడం ద్వారా చక్కని ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అశ్వత్థానికి దీపపుసెగ