
మనసు కలతకు మరణం శరణం కాదు
● ఆత్మహత్య చేసుకుని సాధించేదేమీ లేదు
● సమస్యను జయిస్తే మీరే విజేతలు
● డాక్టర్ వానపల్లి వరప్రసాద్
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో సైకియాట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, ఇన్‌చార్జి హెచ్‌వోడీ డాక్టర్ వానపల్లి వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ మేరకు ఆస్పత్రి ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రికి వివిధ ఆరోగ్య సమస్యలపై వచ్చిన రోగులను ఉద్దేశించి డాక్టర్ వరప్రసాద్ మాట్లాడారు. చనిపోయి సాధించేది ఏమీలేదని, బతికి ఉండి కష్టాలు ఒడ్డి జీవితంలో గెలిస్తే పలువురికి ఆదర్శవంతులమవుతామన్నారు. ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన ఒక మానసిక సమస్య అని, ఈ సమస్యకు మందు ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, ఇన్‌చార్జి సీఎస్ ఆర్‌ఎంవో డాక్టర్ మెహర్, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.