
వీధి ఆవుకు అత్యవసర శస్త్రచికిత్స
ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్ల తొలగింపు
అమలాపురం టౌన్: అమలాపురంలో ఓ వీధి ఆవుకు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎల్.విజయరెడ్డి సోమవారం అత్యవసర శస్త్రచికిత్స చేసి, ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. స్థానిక ఫైర్‌స్టేషన్ వద్ద ఓ వీధి ఆవు కదలేని పరిస్థితుల్లో ఉండి నోరు, ముక్కు వెంబడి తిన్న ఆహారం బయటకు వచ్చేస్తుందని గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు డాక్టర్ విజయరెడ్డికి సమాచారం అందించారు. తక్షణమే ఆయన పశువుల అంబులెన్స్–1992 వాహనంలో తన సిబ్బందితో వీధి ఆవు వద్దకు చేరుకున్నారు. ఆవు పొట్ట ఉబ్బి ఇబ్బంది పడుతున్న సమయంలో డాక్టర్ విజయరెడ్డి తక్షణమే ఆవు కడుపు భాగంలో అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్లను తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. గో ప్రేమికులు స్వామి, పుల్లయ్య, పశు వైద్య సిబ్బంది వెంకటేష్, యశ్వంత్ తదితరులు సహకారం అందించారు.