
జిల్లాలో ఆలయాల మూసివేత
అన్నవరం: అన్నవరం సత్యదేవుని ఆలయాన్ని మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పండితులు సత్యదేవుడు, అమ్మవారికి హారతి ఇచ్చి ఫలహారాలు నివేదిన చేసిన అనంతరం ఆలయ తలుపులు మూసి వేశారు. ఈఓ వీర్ల సుబ్బారావు, ఏఈఓ పెండ్యాల భాస్కర్, ఇతర అధికారులు, వైదిక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం ఒంటి గంట వరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. కాగా సోమవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ అనంతరం ఏడు గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
తుని రూరల్: సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల జిల్లాలోని పలు ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. తుని రూరల్ మండలంలోని తలుపులమ్మ ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 1.30 వరకు నాలుగు వేల మంది దర్శించుకున్నారని, అనంతరం ఆలయాన్ని మూసివేశామని ఈఓ పెన్మత్స విశ్వనాథరాజు తెలిపారు. తిరిగి ఆలయ సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. వివిధ మార్గాల ద్వారా మొత్తం రూ.1,32,715 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు.
సామర్లకోట: అలాగే పంచారామ క్షేత్రం బాలా త్రిపుర సందరి సమేత కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకుని పూజలు అభిషేకాలు నిర్వహించినట్టు అభిషేక పండితులు వేమూరి సోమేశ్వర శర్మ తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 9 గంటలకు సంప్రోక్షణ అనంతరం తెరవనున్నట్టు ఆయన తెలిపారు. స్థానిక మాండవ్య నారాయణ స్వామి ఆలయాన్ని సైతం 12 గంటలకు మూసివేశామని, తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు తెరవనున్నట్టు అర్చకులు అనంత పద్మనాభాచార్యులు తెలిపారు.

జిల్లాలో ఆలయాల మూసివేత

జిల్లాలో ఆలయాల మూసివేత