
లీడర్లే టార్గెట్
సర్వత్రా విస్మయం
జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కాపవరపు రమణపై కూటమి నేతలు జగ్గంపేట పోలీస్టేషన్‌లో అక్రమంగా కేసు బనాయించి వేధింపులకు పాల్పడ్డారు. అక్కడి పోలీసులు రమణను ఒక రోజంతా జగ్గంపేట పోలీస్ స్టేషన్‌లోనే నిర్బంధించడాన్ని ఈ సందర్భంగా అక్కడి పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. మెట్ట ప్రాంతమైన శంఖవరం మండలం మండపంలో గత డిసెంబరు 27న వైఎస్సార్ సీపీ కార్యకర్త గుండుపల్లి నానాజీ పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా టీడీపీ నాయకులు దారి కాసి కత్తులతో దాడి చేశారు. తీవ్ర రక్త స్రావంతో బాధపడుతోన్న నానాజీని తుని ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇలా జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోను వైఎస్సార్ సీపీ నేతల్లో భయోత్పాతాన్ని సృష్టించి కట్టడి చేసే కుట్రలో భాగంగా తెలుగు తమ్ముళ్లు వేధింపులకు దిగుతూ, బనాయిస్తోన్న అక్రమ కేసులపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం చేతిలో ఉందని కూటమి నేతలు బరి తెగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా తెలుగు తమ్ముళ్లు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్ సీపీలో క్రియాశీలక నేతలను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం నేతలు వేధింపుల పర్వానికి తెర తీశారు. గద్దె నెక్కిన దగ్గర నుంచి వివిధ నియోజకవర్గాల్లో కూటమి నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి అక్రమ కేసులు బనాయించడంలో ముందుంటున్నారు. వైఎస్సార్ సీపీ కోసమే పనిచేయడమే పెద్ద నేరం అన్నట్టుగా ఆ పార్టీ నేతలను బెదిరించి దారికి తెచ్చుకోవాలని కేసులతో కుట్రలు పన్నుతున్నారు. జిల్లాలోని జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు, కాకినాడ...ఇలా ప్రతి నియోజకవర్గంలోను ఏదో ఒక కారణంతో పోలీసులను బలవంతం చేసి వైఎస్సార్ సీపీ నేతలపై అనేక కేసులు నమోదు చేయిస్తున్నారు. వేధింపులతో పాటు అన్యాయంగా కేసులు నమోదు చేయడం చూస్తుంటే ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని విజ్ఞులు విశ్లేషిస్తున్నారు.
జిల్లాలోని ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో వయోభారంతో బాధపడుతోన్న 86 ఏళ్ల ముదునూరి రామరాజుపై తాజాగా అక్కడి పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళను అడ్డం పెట్టుకుని అక్రమ కేసు పెట్టడం వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రామరాజు తనయుడు ముదునూరి మురళీకృష్ణంరాజు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు కావడమే పాపం అన్నట్టుగా ఉంది. ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉండటం ప్రత్తిపాడు మండలంలో తెలుగుతమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. నిత్యం ప్రజలతో మమేకం అవుతూండటం ఆ పార్టీ నేతలకు కంటగింపుగా మారింది. ఎవరో ఒకరి సహాయం లేకుండా రామరాజు అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అటువంటి రామరాజు అసభ్యంగా ప్రవర్తించారంటూ ప్రత్తిపాడులో అక్రమంగా కేసు బనాయించారని స్థానికులు ఆక్షేపిస్తున్నారు. ముదునూరిని వైఎస్సార్ సీపీలో ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేసే ఎత్తుగడతోనే పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి కేసులతో బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడుతున్నారు. రామరాజుపై కేసు నమోదుచేసే ముందు కనీసం అతని వయసునైనా పరిగణలోకి తీసుకోకపోవడాన్ని గ్రామస్తులు ఆక్షేపిస్తున్నారు. కేవలం రాజకీయ కోణంలో అక్రమ కేసులు బనాయిస్తూ పోతే చూస్తూ ఉపేక్షించేదిలేదని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. అధికార పార్టీ నేతల ముఖాల్లో సంతోషం కోసం ఇటువంటి కేసులు పెట్టడం అన్యాయమంటున్నారు. అంత వయసు కలిగిన రామరాజుపై కేసు విషయంలో టీడీపీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పై పెచ్చు రామరాజుపై కేసును సమర్థించుకునే రీతిలో టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అసభ్యంగా ప్రవర్తించడానికి వయసుతో పనేమిటంటూ వితండవాదాన్ని తమ్ముళ్లు తెర మీదకు తీసుకువచ్చారు.
ఏడాదిగా ఇదే తంతు
వైఎస్సార్ సీపీ నేతలు లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించడం గడచిన ఏడాదిన్నరగా సాగుతోంది. తునిలో పలువురు వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. ఫిబ్రవరిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, అప్పటి మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరు సుధారాణిపై కౌన్సిలర్లను నిర్బంధించారంటూ తుని పట్టణ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు బనాయించారు. ఈ వ్యవహారంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారంటూ వైఎస్సార్ సీపీ నేతలు రేలంగి రమణ గౌడ్, పోతుల లక్ష్మణ్, షేక్ క్వాజా, చింతల పండు, పామర్తి మహేష్ తదితరులపై తుని టౌన్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేయడం గమనార్హం. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌లంతా సమావేశానికి వెళితే టీడీపీ నేతలు కక్ష కట్టి కిడ్నాప్ కేసు పెట్టడం అప్పట్లో సంచలనమైంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అనుచరుడనే కారణంతో తొండంగి మండలం వైస్ ఎంపీపీ నాగం గంగబాబు తదితరులపై అక్రమ కేసులు బనాయించారు. కోటనందూరు మండలం అల్లిపూడికి చెందిన చింతకాయల చినబాబుతో పాటు మరో ముగ్గురిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారంటూ కేసు నమోదు చేశారు. తుని మండలం తేటగుంట, వెలమకొత్తూరు, ఎన్ సూరవరం గ్రామానికి చెందిన ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు బనాయించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రత్తిపాడులో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రామిశెట్టి బులిరామకృష్ణ మహిళను వేధిస్తున్నారంటూ కేసు పెట్టారు. శరభవరం ఎంపీటీసీ అమరాధి కాశీ జగన్నాథంపై ఇదివరకే కేసులు బనాయించారు. గత జనవరిలో శరభవరం ఉపాధి హామీ సమావేశంలో అక్కడి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు అమరాధి కాశీ జగన్నాథంపై స్థానిక టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కానీ తెలుగు తమ్ముళ్లు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి బాధితులపైనే కేసులు నమోదు చేయించారు. గత అక్టోబర్‌లో ఉత్తరకంచి ఎంపీటీసీ సభ్యుడు ఉమ్మిడి అచ్చన్న(తాతీలు)పై భూ వివాదాన్ని సృష్టించి అక్రమంగా కేసు బనాయించి వేధింపులకు గురిచేశారు.
వైఎస్సార్ సీపీ క్రియాశీలక నేతలే
లక్ష్యంగా కూటమి కక్ష సాధింపు
అక్రమ కేసుల పరంపర
దారికి రాకుంటే వేధింపులు
కేసులకు బెదిరేది లేదంటున్న శ్రేణులు
86 ఏళ్ల వృద్ధుడిపై కేసులా
విస్మయం వ్యక్తం చేస్తోన్న టీడీపీ నేతలు

లీడర్లే టార్గెట్