
పట్టుగూళ్ల ఉత్పత్తిలో కీలకపాత్ర ఉష్ణోగ్రతలదే
తుని రూరల్: పట్టుగూళ్ల ఉత్పత్తిలో కీలకపాత్ర ఉష్ణోగ్రతలదేనని సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్త ఈ భువనేశ్వరి అన్నారు. గురువారం దొండవాకలో చేబ్రోలు అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్ కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టు పురుగుల్లో వివిధ దశలు, పట్టుగూళ్ల ఉత్పత్తిలో జాగ్రత్తలపై రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్త భువనేశ్వరి మాట్లాడుతూ పట్టు పురుగులు గూడు అల్లుకునే 5వ దశలో 12 మేతలకు మల్బరీ ఆకులను అందించి, స్పిన్నింగ్ దశను గుర్తించాలన్నారు. గూడు కట్టడానికి తగినంత స్థలాన్ని కేటాయించాలన్నారు. ఈ దశలో ఉష్ణోగ్రత, తేమ, వెలుతురు, పరిశుభ్రత చంద్రికలు నాణ్యమైన పట్టుగూళ్ల అల్లడంలో ప్రధాన పాత్ర వహిస్తాయన్నారు. పట్టుగూళ్లు అల్లిన తర్వాత నాలుగు రోజులకు వేరు చేయాలని, ఆరో రోజు మార్కెట్‌కు తరలించాలన్నారు. నాణ్యతగల పట్టుగూళ్లకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. సెరికల్చర్ అసిస్టెంట్‌లు, రైతులు పాల్గొన్నారు.
7న తలుపులమ్మ
దేవస్థానం మూసివేత
తుని రూరల్: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల ఏడో తేదీన మధ్యాహ్నం తలుపులమ్మ అమ్మవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు గురువారం తెలిపారు. లోవ దేవస్థానంలో ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కవాట బంధనం చేసి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సంప్రోక్షణ అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు.
అన్నవరం ఆలయ ఈఓ సుబ్బారావుకు స్థాన చలనం?
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును ఆ పదవి నుంచి తప్పించి, ఆయన మాతృసంస్థ రెవెన్యూ శాఖకు సరెండర్ చేయాలని దేవదాయశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ మేరకు ఒకటి రెండ్రోజుల్లో ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం. దేవదాయశాఖకు చెందిన ఆర్‌జేసీ స్థాయి అధికారిని ఇన్‌చార్జి ఈఓగా నియమించనున్నట్టు తెలిసింది. దీనిపై వివరణ కోరగా తాను దేవదాయశాఖ ఉద్యోగిని కాదని, ఏదో రోజు నా మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు వెళ్లవలసిన వాడినేనని ఈఓ సుబ్బారావు తెలిపారు.
8న ప్రభుత్వ ఐటీఐలో
పీఏం అప్రెంటిస్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.జీ.వర్మ గురువారం తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన మేధా గ్రూప్ కంపెనీ 300 అప్రెంటిస్ ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని, ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ఉత్తీర్ణులై ఎన్‌టీసీ సర్టిఫికెట్ కలిగిన వారు సర్టిఫికెట్లతో ఉదయం 8గంటలకు హాజరుకావాలని సూచించారు. స్టైపెండ్ నెలకు రూ.15వేలు చెల్లిస్తారని, వివరాలకు 94404 08182 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
మళ్లీ పెరుగుతున్న నీటి ఉధృతి
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు 10.50 అడుగులు ఉన్న నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ రాత్రి 7గంటలకు 11.30 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 9,11,254 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. మరోపక్క ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా తగ్గుతున్నాయి. శుక్రవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి స్వల్పంగా తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. డెల్టా కాలువలకు సంబంధించి 12,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 5,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 10.49 మీటర్లు, పేరూరులో 15.36 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.76 మీటర్లు, భద్రాచలంలో 42.90 అడుగులు, కూనవరంలో 9.78 మీటర్లు, కుంటలో 18.36 మీటర్లు, పోలవరంలో 11.80 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.85 మీటర్లు వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి.

పట్టుగూళ్ల ఉత్పత్తిలో కీలకపాత్ర ఉష్ణోగ్రతలదే