
సొసైటీ భవనం వేలం వాయిదా
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సుమారు రూ.23 కోట్ల మేర ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన కార్గికేయ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భవనం వేలం వాయిదా పడింది. సొసైటీ చైర్మన్ కోడి వీరవెంకట సత్యనారాయణతో పాటు ఇతర డైరెక్టర్లు ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకుని, వడ్డీ చెల్లించకుండా ముఖం చాటేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సొసైటీ ఆస్తులను సహకార శాఖ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకునేందుకు అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఆస్తులను అమ్మి ప్రజల డిపాజిట్లు చెల్లించేందుకు సహకార శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం కాకినాడ నూకాలమ్మ గుడి వద్ద ఉన్న సొసైటీకి చెందిన మూడు అంతస్తుల భవనానికి వేలం పాట వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సహకార శాఖ అధికారులు అనుకున్న మేర వేలం సొమ్ము రాకపోవడంతో తిరిగి ఈ నెల 8న సోమవారం రెండు గంటలకు వేలం పాట నిర్వహిస్తున్నట్లు సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్టర్, సేల్స్ ఆఫీసర్ జె.శివకామేశ్వరరావు తెలిపారు.