
కాటన్ బ్యారేజీ నుంచి 7.88 లక్షల
క్యూసెక్కుల మిగులు జలాల విడుదల
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 10.30 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజ్ నుంచి 7,88,938 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. అనంతరం స్వల్పంగా తగ్గి రాత్రి 10 అడుగులకు చేరింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ముందుగా ప్రకటించిన విధంగా నీటిని దిగువకు విడుదల చేయకపోవడంతో కాటన్ బ్యారేజీ వద్ద ప్రమాద స్థాయికి నీటి మట్టం చేరలేదు. అయితే శుక్రవారం రాత్రి ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు క్రమేపి పెరుగుతుండటంతో శనివారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 6,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,500, మధ్య డెల్టాకు 700, పశ్చిమ డెల్టాకు 2,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 12.33 మీటర్లు, పేరూరులో 16.65 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.63 మీటర్లు, భద్రాచలంలో 42.90 అడుగులు, కూనవరంలో 17.01 మీటర్లు, కుంటలో 9.85 మీటర్లు, పోలవరంలో 11.31 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.40 మీటర్లు నీటి మట్టాలు కొనసాగుతున్నాయి.
కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జీఎన్‌ఎం సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న కాపీయింగ్ ఆరోపణలపై శుక్రవారం విచారణ జరిగింది. డీఎంఈ డాక్టర్ డీఎస్‌వీఎల్ నరసింహం ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఆర్‌ఎంసీ వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శశి సహా ఆర్‌ఎంసీ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమాసుందరి ఆధ్వర్యంలో ఆర్‌ఎంసీ డైనింగ్ ప్రాంగణంలో విచారణ జరిగింది. జీఎన్‌ఎం సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్ చోటు చేసుకుందా, చేసుకుంటే కారణాలేమిటి, అందుకు తగ్గ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారించారు. 29 మంది ఇన్విజిలేటర్లతో పాటు జీఎన్‌ఎం నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్, సంబంధిత సీటు గుమస్తా, సీనియర్ అసిస్టెంట్ ఏసుబాబును విచారించారు. విచారణ అనంతరం నివేదికను డీఎంఈకి పంపారు.
పొగాకు నారుమడికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
– బోర్డు అధికారి హేమస్మిత
దేవరపల్లి: పొగాకు నారుమడులు కట్టే ముందు రైతులు తప్పనిసరిగా బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి సీహెచ్ హేమస్మిత రైతులకు సూచించారు. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో కట్టిన పొగాకు నారుమడులను పరిశీలించి, రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ ఏడాది పొగాకు బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బోర్డు క్షేత్రస్థాయి అధికారి కీర్తికుమార్ ఆధ్వర్యంలో బృందం పనిచేస్తుందన్నారు. నారుమడులను పరిశీలించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారని ఆమె చెప్పారు. బృందం శుక్రవారం దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోని పల్లంట్లలో యలమాటి సుధాకర్ పొగాకు నర్సరీలను తనిఖీ చేసినట్టు ఆమె చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా నారుమడులు కడితే చర్యలు తీసుకొంటామన్నారు. రిజిస్ట్రేషన్ గల నారుమడుల్లోనే రైతులు నారు కొనుగోలు చేయాలని, నారు కొనుగోలు చేసిన నారుమడి రైతు ఇచ్చిన రశీదును నాట్లు వేసే సమయంలో మొక్కఫారంతో పాటు జత చేసి వేలం కేంద్రంలో అందజేయాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని నారుమడుల నుంచి నారు కొనుగోలు చేస్తే పొగాకు బ్యారన్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తెలిపారు. 2025–26 పంట కాలానికి రాష్ట్రంలో 142 మిలియన్ల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇచ్చిందన్నారు.వేలం కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు 96 మంది రైతులు నారుమడులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. వీరంతా నారు వ్యాపారస్తులేనని చెప్పారు.