
కాకినాడలో అన్య దేశపు జెండాల ప్రదర్శన
● మిలాద్– ఉన్– నబీ ర్యాలీలో కలకలం
● పోలీసుల అదుపులో నలుగురు
కాకినాడ క్రైం: మిలాద్ – ఉన్ – నబీ సందర్భంగా శుక్రవారం కాకినాడలో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలో కలకలం రేగింది. మహ్మద్ ప్రవక్త 1500వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలోకి నాలుగు అనుమానిత కార్లు చొరబడ్డాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ, ర్యాష్‌గా వాటిని నడపడంతో పలువురు ముస్లింలు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొంత దూరం వెళ్లాక, నాలుగు కార్ల నుంచి నలుగురు వ్యక్తులు అన్య దేశపు జెండాలను ప్రదర్శించి మత ఘర్షణలకు పురిగొల్పే చర్యలకు పాల్పడ్డారు. తక్షణమే అప్రమత్తమైన కాకినాడ వన్ టౌన్ పోలీసులు వాహనాలను అడ్డుకొని ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మూలాలపై ఆరా తీస్తున్నారు. దీనిలో కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఆ జెండాలతో మాకు సంబంధం లేదు
బోట్‌క్లబ్ (కాకినాడ): మిలాద్ – ఉన్ – నబీ ర్యాలీ సందర్భంగా వేరే దేశపు జెండాలతో వచ్చిన కార్లతో తమకు సంబంధం లేదని మక్కా మసీదు సెక్రటరీ ఎండీ ఖాజామెహిద్దీన్ తెలిపారు. జగన్నాథపురంలో శనివారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మక్కా మసీదు నుంచి శాంతియుతంగా ర్యాలీ ప్రారంభించామన్నారు. కార్యక్రమానికి సంబంధం లేని కొందరు వేరే దేశపు జెండాలతో వచ్చి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం బాధాకరమన్నారు. ఈ ఘటనతో తమకు సంబంధం లేకపోయినప్పటికీ ఈ సమాజానికి, పోలీసు యంత్రాంగానికి క్షమాపణలు తెలుపుతున్నామన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. సమావేశంలో మసీద్ అజాం ఖాదర్ అలీఖాన్, ముస్లిం నాయకులు షేక్ గౌస్ మొహీద్దీన్, కుతుబుద్ధీన్, ఎండీ ఖాన్ పాల్గొన్నారు.