
ఇదేం దగా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఖరీఫ్ పంట కాలం జూన్ నుంచి ప్రారంభమవుతుంది. దీనికోసం మే నెలలోనే పొలం దుక్కులు చేయాలి. విత్తనాలు సిద్ధం చేసుకోవాలి. నారుమడి వేయాలి. పొలాల్లో దమ్ములు చేయాలి.. ఆ తర్వాత నాట్లు వేయాలి.. అదునుకు ఎరువులు వేయాలి.. ఇవి కాకుండా కూలీ ఖర్చులు.. ఇవన్నీ జరగాలంటే కర్షకుడి చేతిలో కాసులుండాల్సిందే. గతంలో అయితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విత్తు నుంచి విక్రయం వరకూ అన్ని విధాలా అండగా ఉండేది. జిల్లాలోని రూ.1.86 లక్షల మందికి రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించేది. కానీ, నేడు కూటమి పాలనలో ఆ పరిస్థితి లేకుండా పోయిందని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నాడు నమ్మించి.. నేడు ముంచేసి..
తాము అధికారంలోకి వస్తే అంతకు మించి సాయం చేస్తామని గత సార్వత్రిక ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమి నేతలు నేడు తమను నిలువునా ముంచేశారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్ ముందస్తు సాగు పేరిట హడావుడి చేసిన ప్రభుత్వం అందుకు తగిన రీతిలో రైతుకు తోడ్పాటు అందించలేదు. రబీ ధాన్యం డబ్బులు బకాయి పెట్టింది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పేరిట ఇస్తామన్న రూ.20 వేలు తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది అనేక సాకులతో అర్హులైన సుమారు 40 వేల మంది రైతులకు కోత పెట్టారు. ఈ పథకాన్ని 1.48 లక్షల మందికి మాత్రమే పరిమితం చేశారు. అది కూడా కేంద్రం ఇచ్చిన రూ.2 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు మాత్రమే కలిపి రూ.7 వేలు విదిల్చారు. ఇది ఏ మూలకూ చాలక రైతులు సాగు పెట్టుబడులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుఖీభవ సొమ్ము కూడా పలువురికి కేంద్రం ఇచ్చిన రూ.2 వేలు మాత్రమే జమ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా అందలేదని వారు ఆవేదన చెందుతున్నారు.
తప్పని అప్పులు
ఎకరం పొలంలో వరి సాగు చేయాలంటే విత్తనాల దగ్గర నుంచి నాట్ల వరకూ సుమారు రూ.15 వేలు ఖర్చవుతుంది. ఎరువులకు మొదటి దఫా రూ.2,500 అవసరం కాగా, మొత్తం రూ.17,500 ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో కూటమి సర్కారు ఇచ్చిన రూ.7 వేల పెట్టుబడి సాయం దేనికి అక్కరకొస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సాగు పెట్టుబడుల కోసం పలువురు రైతులు అధిక వడ్డీలకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు బంగారు ఆభరణాలను వర్తకుల వద్ద కుదువ పెట్టి అప్పులు తెచ్చుకొంటున్న పరిస్థితి నెలకొంది. చంద్రబాబు చెప్పే మాటలకు, చేస్తున్న పనులకు అసలు పొంతనే ఉండదనే విషయం అన్నదాత సుఖీభవ విషయంలో మరోసారి రుజువైందని రైతులు మండిపడుతున్నారు.
‘సుఖీభవ’ అరకొర సాయంపై అన్నదాతల ఆగ్రహం
జిల్లాలో సుమారు 40 వేల
మందికి పంగనామం
రైతుకు తప్పని అప్పుల తిప్పలు
అరకొర సాయంతో అవస్థలు
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్‌తో లింక్ పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.20 వేలు ఒకేసారి విడుదల చేయాలి. అరకొరగా ఇస్తున్న సాయం చూస్తూంటే పెట్టుబడి బారెడు.. సాయం జానెడు అన్నట్టుగా పరిస్థితి ఉంది. రైతులను ఆదుకోవాలంటే ఈ పథకం సొమ్ము వాయిదాల్లో కాకుండా ఒకేసారి ఇవ్వాలి.
– బండే వీరబాబు, రైతు, వేములవాడ, కరప మండలం
భంగ పడ్డాం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు రైతు భరోసా సాయం అందుకున్నాను. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ సాయం అందలేదు. ఈ పథకం కింద కూటమి ప్రభుత్వం ఒకేసారి రూ.20 వేలు ఇస్తుందని గంపెడాశలు పెట్టుకున్నాం. ఏడాది గడచిపోయిన తరువాత రూ.7 వేలు మాత్రమే వేయడం.. అది కూడా కేంద్రం ఇచ్చే రూ.2 వేలు కలిపి ఇవ్వడం అన్యాయం. అది కూడా అందరికీ అందలేదు. ప్రస్తుతం ఇచ్చిన రూ.7 వేలు ఏ మూలకూ చాలవు. పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎరువులకు కూడా చాలని పరిస్థితి. మూడు వాయిదాలు కాకుండా కనీసం రెండు వాయిదాల్లోనైనా అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతులందరికీ ఇవ్వాలి. – మేకా శ్రీనివాసరావు, రైతు, సామర్లకోట

ఇదేం దగా?

ఇదేం దగా?