
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న కూటమి
● కాకినాడలో కదం తొక్కిన బీసీలు
● ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడికి నిరసన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తోందని బీసీలు గళమెత్తారు. అధికార పార్టీ గూండాలు బరితెగించి బీసీలపై వరుసగా దాడులకు దిగుతూ, భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచగొల్ల రమేష్ యాదవ్‌పై టీడీపీ గుండాల దాడిని ఖండిస్తూ కాకినాడలో గురువారం నిరసన తెలిపారు. జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన పార్టీ నేతలు, బీసీ సెల్, స్థానిక సంస్థల ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీఆర్ కాలేజీ సమీపాన మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం జంక్షన్‌కు చేరుకున్నారు. బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో చంద్రబాబు సర్కారు విఫలమైందని ఆందోళన తెలిపారు. అనంతరం ఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా నల్లగుండువారిపాలెంలో ప్రచారంలో పాల్గొన్న రమేష్ యాదవ్‌పై జరిగిన దాడి అనాగరికమని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్, బీసీ జేఏసీ కో కన్వీనర్ అల్లి రాజబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని, రమేష్ యాదవ్‌పై దాడే దానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేసి ఏదో ఒక విధంగా గెలవాలని, జగన్ నియోజవర్గంలో పైచేయి సాధించాలనే కుట్రలో భాగమే ఈ రాద్ధాంతమని మండిపడ్డారు. పోలీసుల సహకారంతో రిగ్గింగ్ చేసి గెలవాలన్న చంద్రబాబు కుట్రలో భాగమే ఈ దాడి అని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీలంటే చంద్రబాబుకు మొదటి నుంచీ చులకన భావమేనన్నారు. 2014లో అలవిగాని హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదని గుర్తు చేశారు. ఆ హామీలు అమలు చేయాలని అడిగిన మత్స్యకారులను తాట తీస్తా, తొక్క తీస్తా.. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారంటూ ఏవిధంగా అవమానించారో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర సెక్రటేరియట్‌లో చంద్రబాబును కలిసి హామీలు అమలు చేయాలని నాయీ బ్రాహ్మణులు అడిగితే.. పవిత్రమైన సెక్రటేరియట్‌లోకి మీరు ఎలా వస్తారంటూ అవమానించారన్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ సామాజిక వర్గాన్ని అవమానించారని గుర్తు చేశారు. అదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ 50 శాతం రిజర్వేషన్ కల్పించారని, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించి గౌరవించారని రాజబాబు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బూత్ కమిటీ కన్వీనర్, జెడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసీ కుమార్, పార్టీ బీసీ నేతలు యనమల కృష్ణుడు, ఒమ్మి రఘురాం, అనుసూరి ప్రభాకర్, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు జమ్మలమడక నాగమణి, వాసుపల్లి కృష్ణ, ఆయా నియోజకవర్గాల బీసీ సెల్ నేతలు రేపాటి శ్రీనివాస్, చెక్క చక్రవర్తి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), యువజన విభాగం కాకినాడ అధ్యక్షుడు రోకళ్ల సత్య, నందం, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న కూటమి