
సాంకేతికతతో గిరిజన సంస్కృతి పరిరక్షణ
రాజానగరం: మౌఖిక రూపంలో ఉండే అపారమైన గిరిజన సాహిత్య, సంస్కృతీ సంపదను సాంకేతిక పరిజ్ఞానంతో పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించాలని ఆదికవి నన్నయ యూని వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. వర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం సహకారంతో ఎస్సీ, ఎస్టీ సెల్, కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యాన ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, ‘స్థానిక ప్రజల కృత్రిమ మేధస్సు – హక్కులను కాపాడుకోవడం, భవిష్యత్తును రూపొందించడం’ అనే థీమ్‌తో ప్రపంచ గిరిజన దినోత్సవం జరుగుతుందని అన్నారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించడంలో తను 35 ఏళ్ల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలపై అవగాహన కలిగి ఉండటం ఆనందంగా ఉందని చెప్పారు. గిరిజనులు వాడుక భాషలో మౌఖికంగా సాహిత్య సేద్యం చేస్తున్నారన్నారు. ప్రకృతితో బంధం ఏర్పరచుకుని, రాయిలో కూడా దేవుడిని చూడగలిగే నిర్మలమైన మనస్సున్న వారు గిరిపుత్రులని ప్రసన్నశ్రీ అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, సదస్సు కన్వీనర్ పి.విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు.