రేపు ఎస్సీ సెల్‌ విస్తృత స్థాయి సమావేశం | - | Sakshi
Sakshi News home page

రేపు ఎస్సీ సెల్‌ విస్తృత స్థాయి సమావేశం

Jul 27 2025 7:00 AM | Updated on Jul 27 2025 7:00 AM

రేపు ఎస్సీ సెల్‌  విస్తృత స్థాయి సమావేశం

రేపు ఎస్సీ సెల్‌ విస్తృత స్థాయి సమావేశం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ నేతలు, అభిమానులు తరలి వచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విజ్ఞప్తిచేశారు. కాకినాడ సూర్యకళా మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు హాజరుకానున్నారని శనివారం మీడియాకు తెలియచేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వేధింపులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సుధాకర్‌బాబు దిశానిర్దేశం చేయనున్నారని వివరించారు. పార్టీ ఎస్సీ సెల్‌ కార్యాచరణపై చర్చించనున్నట్టు రాజా తెలిపారు. ఎస్సీ సెల్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు హాజరై విజయవంతం చేయాలని రాజా కోరారు.

30న జాబ్‌మేళా

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి ఇ.వసంతలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మశీ సంస్థ 20 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందని, 18 నుంచి 35 ఏళ్ల లోపు అభ్యర్థులు హాజరుకావచ్చని, పదో తరగతి అపైన ఇంటర్మీడియెట్‌, బి.ఫార్మశీ, ఎం.ఫార్మశీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 86398 46568 నెంబరులో సంప్రదించాలని సూచించారు.

పీ–4ను ముందుకు

తీసుకువెళ్లాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడసిటీ): ఆర్థిక అసమానతలను తొలగించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీ–4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు బంగారు కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా మార్గదర్శకులను ఎంపిక చేయాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ లో పీ4, స్వర్ణాంధ్ర –2047 విజన్‌ ప్లాన్‌ వంటి అంశాలపై నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌గా తాను ఐదు బంగారు కుటుంబాలను స్వీకరించినట్టు తెలిపారు. జిల్లాలో 1.02 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించామని వచ్చేనెల రెండో వారం నాటికి 80 వేల బంగారు కుటుంబాలు దత్తత తీసుకునేలా పనిచేయాలన్నారు.

ఆశా అభ్యర్థులు మోసపోవద్దు

కాకినాడ క్రైం: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఇటీవల ప్రకటించిన ఆశా కార్యకర్తల ఖాళీల భర్తీపై శనివారం డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరసింహ నాయక్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. పోస్టు వేయిస్తామని అభ్యర్థుల నుంచి కొందరు డబ్బులు గుంజుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎంపిక కలెక్టర్‌ పర్యవేక్షణలో డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ సొసైటీ నిర్వహిస్తుందని, మోసం చేస్తున్న వ్యక్తులపై కలెక్టర్‌, పోలీసులకు ఫిర్యాదు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదయ్యేలా సిఫార్సు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement