
ప్రాణాలు పోయినా పట్టించుకోరా!
ఫ రహదారులు దిగ్బంధించి
మత్స్యకారుల నిరసన
ఫ కాకినాడలో తీవ్ర ఉద్రిక్తత
ఫ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు
కాకినాడ క్రైం: నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం తాళ్లరేవు సమీపంలో పటవల వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, బాధిత కుటుంబాలు మత్స్యకార నేతల ఆధ్వర్యంలో న్యాయ పోరాటానికి దిగాయి. న్యాయం చేయాలని రోడ్డెక్కాయి. ఈ పరిస్థితి నగరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రధాన కూడళ్లలో మూడుచోట్ల రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సమన్వి ట్రావెల్స్ అధినేత రావాలని, ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద మత్స్యకార నాయకుడు సంగాడి ఈశ్వరరావు సహా పెద్దలు నిరసన వ్యక్తం చేశారు. 60 మందితో మొదలైన ఈ నిరసన వెయ్యి మందికి చేరుకుంది. తొలుత జీజీహెచ్ వద్ద వార్ప్ రోడ్డులో బాధిత కుటుంబీకులు రోడ్డుపై బైఠాయించారు. అక్కడి నుంచి ర్యాలీగా వాహనాలతో కాలినడకన వెళ్లి జగన్నాథపురం కొత్త వంతెనపై నిరసన తెలిపారు. జగన్నాథపురం నుంచి వార్ప్ రోడ్డు నుంచి వెళ్లే మార్గాన్ని దిగ్బంధించారు. అక్కడి నుంచి పాత వంతెనపైకి వెళ్లి నిరసన తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, సమన్వి ట్రావెల్స్ అధినేతను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆ అధినేత అమర్‌నాథ్ యాత్రలో ఉన్నారని పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా మత్స్యకారులంతా మండిపడ్డారు. ప్రాణాలు తీసేసి యాత్రలు చేస్తుంటే కళ్లకు గంతలు కట్టుకున్నారా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సహా డిప్యూటీ సీఎం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కానరాని కొండబాబు
తన సామాజిక వర్గ పేదలు, అందులోనూ మహిళలు ప్రాణాలు కోల్పోతే కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పందించిన తీరుపై మత్స్యకార నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. బాధితులు ఆయన దగ్గరకు వెళితే, బీమా వచ్చాక పరిహారం అందుతుందని, పరోక్షంగా తానేమీ చేయలేనని చేతులెత్తేశారని మత్స్యకారులు వాపోయారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆయన ఇంటికి కొద్ది దూరంలోనే నినాదాలు చేశారు. శుక్రవారం జీజీహెచ్‌కు వచ్చి మీడియాకు పోజులిచ్చి వెళ్లిపోయారని వారన్నారు. తన సొంత సామాజిక వర్గానికే న్యాయం చేయలేని వ్యక్తి కాకినాడకు ఏం చేస్తారని బాహాటంగానే విమర్శించారు. మూడు నిండు ప్రాణాలు పోతే ఇంతేనా చేసేదంటూ ప్రశ్నించారు.
మృతదేహాల తరలింపు
ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో బస్సు యాజమాన్యంతో మాట్లాడిన పోలీసులు మత్స్యకార పెద్దలతో ప్రాథమిక దశ చర్చలు నిర్వహించి, నిరసనకు తాత్కాలిక విరమణ ఇచ్చారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించగా శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.
క్షతగాత్రురాలికి కొనసాగుతున్న చికిత్స
ప్రమాద ఘటనలో గాయపడిన ఓలేటి లక్ష్మి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఎడమ కాలు, చేయిలో ఎముకలు విరిగాయని, శస్త్రచికిత్స చేస్తామని అన్నారు.

ప్రాణాలు పోయినా పట్టించుకోరా!

ప్రాణాలు పోయినా పట్టించుకోరా!