
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ దారుణం
ఫ అడుగంటుతున్న ప్రజాస్వామ్య విలువలు
ఫ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. రాజమహేంద్రవరంలోని శ్యామలాంబ ఆలయ సెంటర్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ రావు మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల ముందు రోజు కావాలనే అరెస్టు చేసినట్లు కనిపిస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన భావ ప్రకటన హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం తగదన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విలువలు అడుగంటిపోతున్నాయని సూర్యనారాయణ విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్ వారు వదిలిన లెగసీని ప్రస్తుతం పోలీసులు అందిపుచ్చుకున్నారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్, రాజ్యాంగ పండితులు ప్రజాస్వామ్యాన్ని ఉన్నత విలువలతో నిలబెట్టాలని చూశారన్నారు. రాజ్యసభలో ప్రభుత్వానికి బలం లేనప్పుడు మిథున్‌రెడ్డి కీలకంగా వ్యవహరించి, ప్రజాస్వామ్య విలువలను కాపాడారని ఆయన అన్నారు. ఒక సాధారణ వ్యక్తిగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేని మిథున్‌రెడ్డి వ్యక్తిత్వం రెండేళ్లుగా ఆయనతో చేస్తున్న ప్రయాణం వల్ల తనకు తెలిసిందన్నారు. రాజకీయ నాయకుడి కంటే, మాములు వ్యక్తిగానే ఆయన వ్యవహరిస్తారన్నారు. విచారణకు సహకరించేవాళ్లను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం పోలీసులకు తగదన్నారు. ఇండియన్ పోలీస్ యాక్ట్‌ను అతిక్రమిస్తున్నారని ఆయన వాపోయారు. మిథున్‌రెడ్డిని భేషరతుగా బెయిల్‌పై విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారం ఉంది కదా అని ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే ఎలాగన్నారు. ప్రజాస్వామ్య పోకడలు ఎక్కడికి పోతున్నాయని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డిని ప్రధాని మోదీ కౌగిలించుకుని వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు మంత్రి లోకేష్‌ని మోదీ కౌగిలించుకున్నారని రేపటి పరిస్థితి ఏంటో అని ఛలోక్తి విసిరారు. మిథున్‌రెడ్డితో ములాఖత్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఇస్తారో లేదో చూడాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం, అమలాపురం లీగల్ సెల్ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్, ఎం.ప్రసాద్, పిల్లి గంగాధర్, కురుమిల్లి శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.