
అనుబంధ విభాగాలతో పార్టీ బలోపేతం కావాలి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీ అనుబంధ విభా గాలు సమన్వయంతో పని చేయడం ద్వారా జిల్లా లో పార్టీ బలోపేతం కావాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా నియమితులైన వై.సాయిప్రశాంత్ కాకినాడ లో సోమవారం రాజాను కలిశారు. ఈ సందర్బంగా రాజా మాట్లాడుతూ, జిల్లాలోని అనుబంధ విభాగాల ప్రతినిధులు పార్టీ అభ్యన్నతికి పాటు పడేలా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అనుబంధ విభాగాలను త్వరితగతిన నియమించాలన్నారు. పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, నాయకుడు బత్తుల సాయిరామ్ కూడా పాల్గొన్నారు.
ఆషాఢం ఆదాయం అదుర్స్
తలుపులమ్మ తల్లికి రూ.1.56 కోట్ల రాబడి
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం ఆదాయం రూ.1.56 కోట్లు లభించింది. అన్నవరం దేవస్థానం డిప్యూటీ కమిషనర్, సహాయ కార్యనిర్వహణాధికారి పి.బాబూరావు పర్యవేక్షణలో లోవ దేవస్థానం ఆవరణలో హుండీలను సోమవారం తెరిచారు. అమ్మవారి పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో ఆదాయం లెక్కించారు. నోట్లు రూ.63,15,141, నాణేలు రూ.4,42,318 కలిపి మొత్తం రూ.67,57,459 సమకూరిందని లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఆషాఢ మాసం నెల రోజులూ పూజా టికెట్లు, వసతి గదుల అద్దెలు, లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం, విరాళాల రూపంలో మరో రూ.88,59,239 ఆదాయం లభించిందని వివరించారు. మొత్తం రూ. 1,56,16,698 ఆదాయం సమకూరిందన్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి రూ.26.62 లక్షలు అధికంగా లభించిందన్నారు. నగదు లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, శ్రీవారి సేవకులు, నాయీ బ్రాహ్మణులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
పీ–4 నిర్బంధం చేస్తే బహిష్కరిస్తాం
అమలాపురం టౌన్: పీ–4 కార్యక్రమాన్ని నిర్బంధం చేస్తే బహిష్కరిస్తామని యూటీఎఫ్ కోనసీమ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఎంటీవీఏఎస్ సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పీ–4 కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు 5, ఉపాధ్యాయులు 2 పేద కుటుంబాలను తప్పనిసరిగా దత్తత తీసుకోవాలన్న ఆంక్షలు సమంజసం కాదన్నారు.

అనుబంధ విభాగాలతో పార్టీ బలోపేతం కావాలి