ఉత్సాహం..ఉత్తేజం | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహం..ఉత్తేజం

Jul 29 2025 8:10 AM | Updated on Jul 29 2025 9:00 AM

ఉత్సా

ఉత్సాహం..ఉత్తేజం

సమావేశానికి తరలివచ్చిన దళితులు

సమావేశంలో మాట్లాడుతున్న సుధాకర్‌బాబు

అక్టోబర్‌ నుంచి

దళిత ఫోర్స్‌ పర్యటనలు

పార్టీ అధిష్టానం ఆదేశాలతో అక్టోబర్‌ నుంచి గ్రామాలు, మండలాల్లో దళిత ఫోర్స్‌ పర్యటించాలంటూ కుమార్‌రాజా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ఎస్సీ సెల్‌ పరిశీలకులు బి.శ్రీనివాసరావు, ఎస్సీ సెల్‌ నియోజకవర్గాల అధ్యక్షులు బల్ల సూరిబాబు, పెదపాటి రమేష్‌ కుమార్‌, బంగారు కృష్ణ, గుడాల వెంకటరత్నం, లంక కృపానందం, భుల అబ్బులు కూడా ప్రసంగించారు. పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, అనుబంధ విభాగాల కోనసీమ, కాకినాడ పరిశీలకుడు వై.సాయిప్రశాంత్‌, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్‌, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, ప్రచార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు, బీసీ సెల్‌, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అల్లి రాజబాబు, రాగిరెడ్డి బన్ని, సిటీ యూత్‌ అధ్యక్షుడు రోకళ్ల సత్య తదితరులు పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, అంబేడ్కర్‌, బాబూ జగ్జీవన్‌రామ్‌ చిత్రపటాలకు నివాళులర్పించారు. సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు వందన సమర్పణ చేశారు.

వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ సమావేశానికి పోటెత్తిన దళితులు

కూటమి సర్కారుపై నిప్పులు

సాగనంపే వరకూ నిద్రపోబోమని ప్రతిన

కేసులకు, దౌర్జన్యాలకు భయపడేది లేదని స్పష్టీకరణ

జగన్‌ను సీఎంను చేయడానికి

సిద్ధమంటూ నినాదం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారుపై దళితుల్లో నెలకొన్న అసంతృప్తి కాకినాడలో సోమవారం జరిగిన వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా విస్తృత స్థాయి తొలి సమావేశంలో ప్రస్ఫుటమైంది. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశానికి ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్‌రాజా అధ్యక్షత వహించారు. జిల్లా నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దళితులతో సమావేశ ప్రాంగణమైన సూర్య కళా మందిరం కిక్కిరిసిపోయింది. సగం మంది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రారంభం నుంచి చివరి వరకూ జగన్‌ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.

ఆకట్టుకున్న టీజేఆర్‌ ప్రసంగం

ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. కూటమి 13 నెలల పాలనలో దళితులు, దళిత మహిళలపై వివక్ష, కక్షపూరితంగా జరుగుతున్న దాడులను తనదైన శైలిలో ఆయన ఎండగట్టిన తీరు సభికుల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. దళితుల సంక్షేమ పథకాల్లో పెడుతున్న కోతలను గణాంకాలతో అర్థమయ్యే రీతిలో వివరించారు. వారిని అణగదొక్కేందుకు చూస్తున్న కూటమి సర్కారును కడిగి పారేశారు. ఆ సందర్భంగా జై జగన్‌ నినాదాలు మిన్నంటాయి. ‘మీ సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చిన జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమేనా?’ అంటూ ప్రశ్నించి అందరిలో ఉత్తేజాన్ని నింపారు. ‘కూటమి సర్కారు పెట్టే కేసులకు బెదిరిపోయి బయటకు రారా.. తలలు పగలగొడతారని భయపడతారా.. ప్రాణాలైనా అర్పించడానికి వెనుకాడేది లేదు.. మన సంక్షేమ పథకాలను పునరుద్ధరించుకోవాలంటే జగన్‌ను సీఎంను చేసుకోవాలి’ అని సుధాకర్‌బాబు నొక్కి చెప్పినప్పుడు.. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. జగన్‌ను సీఎంను చేస్తాం’ అనే నినాదాలతో సమావేశ మందిరం ప్రతిధ్వనించింది. దళితుల భవిష్యత్తు బాగుండేందుకు కూటమి సర్కారును సాగనంపేలా ప్రతి గ్రామం, ప్రతి మండలంలో దళితులు సత్తా చాటాలని పిలుపునిచ్చినప్పుడు దళితులు జగన్‌కు జై కొట్టారు.

వెలుగుల కోసం సత్తా చాటాలి

పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకారావు ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. వెలుగుల నుంచి చీకట్లోకి నెట్టేసిన కూటమిని సాగనంపి.. తిరిగి వెలుగుల కోసం దళిత సత్తా చాటాలని పిలుపునిచ్చారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న చంద్రబాబుకు, దళితులంటే నాకు మేనమామలు అన్న జగన్‌ మనస్తత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనకారావు అర్థమయ్యేలా వివరించినప్పుడు జనం చప్పట్లతో స్వాగతించారు. చంద్రబాబు కేబినెట్‌లో దళితులకు రెండే రెండు పదవులిస్తే.. జగన్‌ తన కేబినెట్‌లో హోం, విద్య, ఎకై ్సజ్‌ వంటి కీలక శాఖలతో సమున్నత స్థానం కల్పించారని, ఆయనను తిరిగి సీఎంను చేసుకోవాలని అన్నప్పుడు ‘సీఎం జగన్‌’ అంటూ దళితులు ముక్తకంఠంతో నినదించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువతులు అదృశ్యమయ్యారని దుష్ప్రచారం చేసిన పవన్‌.. అనంతపురంలో సామూహిక అత్యాచారంతో తల్లి అయిన బాలికను కనీసం పరామర్శించలేదంటూ కనకారావు తూర్పారబట్టిన తీరు ఆకట్టుకుంది.

జగన్‌ వెంటే దళితులు

● చంద్రబాబు మాటలు నమ్మి అన్ని వర్గాలూ మోసపోయినా దళితులు మాత్రం జగన్‌ వెంటే ఉన్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. దేశమంతా అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలవుతూంటే రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందంటూ పెదబాబు, చినబాబుల తీరును ఆయన ఎండగట్టారు.

● ఆవిర్భావం నుంచీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న దళితులు జగన్‌ను మరోసారి సీఎంను చేసేంత వరకూ పోరాటాలకు సిద్ధపడాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు పిలుపునిచ్చారు.

● అధికారం ఉన్నా లేకున్నా జగన్‌ వెంటే జనం.. అదే ప్రభంజనం అని మాజీ ఎంపీ వంగా గీత అన్నారు.

● ‘ప్రాణాలైనా అర్పిద్దాం.. జగన్‌ను సీఎంను చేసుకుందాం. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో దళిత ఫోర్స్‌తో సమన్వయంగా ముందడుగు వేద్దామని ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్‌రాజా పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. జగన్‌ను సీఎంను చేసుకుంటేనే మన సంక్షేమం మనకు తిరిగి దక్కుతుందనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు.

● కూటమి పాలనలో దళితులు, దళిత మహిళలపై జరుగుతున్న దాడులు, అణచివేతలకు ఎదురొడ్డి పోరాడాల్సిన అవసరాన్ని మాజీ ఎమ్మెల్సీ అంగుళూరి శివకుమారి, మాల కార్పొరేషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, గుల్లా ఏడుకొండలు వివరించారు.

● 75 ఏళ్ల స్వాతంత్య్ర రాజకీయ చరిత్రలో తొలిసారి రెల్లి సామాజికవర్గానికి కాకినాడ డిప్యూటీ మేయర్‌ పదవి కట్టబెట్టిన జగన్‌ దళితుల పక్షపాతి అని మాజీ డిప్యూటీ మేయర్‌ మీసాల ఉదయ్‌కుమార్‌ అన్నారు.

దళితుల సత్తా చూపాలి

కూటమి ప్రభుత్వం దళితుల హక్కులు కాలరాస్తూ వారి పథకాలను ఎత్తేస్తోంది. 2027 లేదా 2029 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి సీఎంను చేసుకోవడం ద్వారా దళితుల సత్తా ఏమిటో తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్‌ తన ఐదేళ్ల పాలనలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.2.75 లక్షల కోట్లు జమ చేశారు. ఇందులో 40 శాతం అంటే రూ.37 వేల కోట్లు దళితులకే వెళ్లాయి. కూటమి ప్రభుత్వం పథకాలన్నింటినీ ఆపేసి దళితుల అభ్యున్నతిని దెబ్బ తీస్తోంది. కూటమి పాలనలో ఏటా రూ.10 వేల కోట్ల మేర దళితులు నష్టపోతున్నారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో చేస్తున్న పాత్రలు చూసి సామాజిక న్యాయం పాటిస్తారనుకున్నాం. అంబేడ్కర్‌ రాజ్యాంగం ప్రకారం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌.. తాను సనాతన వాదినని చెప్పుకోవడమేమిటో అర్థం కావడం లేదు. పవన్‌ను చూసి రాజకీయం సిగ్గుతో తల వంచుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను సీఎంను చేసుకోవడానికి దళితులు, మైనార్టీలు ప్రాణాలర్పించడానికి కూడా వెనుకాడరు. 13 నెలల చంద్రబాబు పాలనలో చినబాబు రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో వారి స్థాయి ఏమిటో ప్రజలకు తెలిసొచ్చింది. మీ పాలన ఇక వెయ్యి రోజులు మాత్రమే, 1001 రోజు కచ్చితంగా మీకు దళితుల సత్తా ఏమిటో తెలిసొస్తుంది. అంబేడ్కర్‌ స్మృతివనాన్ని పీపీపీ విధానంలో వ్యాపార కేంద్రంగా మార్చేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలో తల్లికి వందనం తప్ప మరో పథకమేదైనా అమలు చేసిందా? ఈ పథకాన్ని దళిత, బలహీనవర్గాలకు కాకుండా టీడీపీ నేతలకు దోచి పెడుతున్నారు. క్యాబినెట్‌ మంత్రి అయి ఉండి అచ్చెన్నాయుడు సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని ఎలా అన్నారు?

– టీజేఆర్‌ సుధాకర్‌బాబు,

వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఉత్సాహం..ఉత్తేజం1
1/2

ఉత్సాహం..ఉత్తేజం

ఉత్సాహం..ఉత్తేజం2
2/2

ఉత్సాహం..ఉత్తేజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement