
తల్లికి వంచన ఎందుకు?
● తల్లికి వందనం డబ్బులు
రాకపోవడంపై ఆగ్రహం
● కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో
క్యూ కట్టిన తల్లిదండ్రులు
● పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదుల వెల్లువ
కాకినాడ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యలు చెప్పుకొనేందుకు జిల్లా నలుమూలల నుంచీ ప్రజలు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో తమ ఇబ్బందులు ఏకరువు పెట్టారు. ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 921 మంది తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ముఖ్యంగా తల్లికి వందనం నగదు తమకు జమ కాలేదంటూ అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అర్హతలున్నప్పటికీ తమకు తల్లికి వందనం డబ్బులివ్వలేదని, ఈ వంచన ఏమిటని ప్రశ్నించారు. దీంతో కలెక్టరేట్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక దశలో అర్జీలదారులను నియంత్రించలేక కలెక్టరేట్ సిబ్బంది, పోలీసులు చేతులెత్తేశారు. చివరకు తల్లికి వందనం అర్జీలు స్వీకరించేందుకు కలెక్టర్ షణ్మోహన్ ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసి మరీ అర్జీలు స్వీకరించారు. తల్లికి వందనం నగదు జమపై విద్యా శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, పేద విద్యార్థుల తల్లులకు డబ్బులు ఎందుకు పడలేదో సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని, అర్హుల జాబితా తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్లిప్తంగా విధులు నిర్వహిస్తే కుదరదని స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయనే పేరుతో తల్లికి వందనం పథకానికి అర్హులు కాదంటూ తమ పిల్లలను పక్కన పెట్టడం సరికాదని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సచివాలయాల్లో తల్లికి వందనం ఆన్‌లైన్ నమోదును ఇష్టానుసారం చేశారని, దీంతో తమ పిల్లలు ఈ పథకానికి దూరమయ్యారని ఆరోపించారు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, మరోవైపు విద్యుత్ చార్జీలు పెంచడం వంటి కారణాలతో అంశాలతో బిల్లులు పెరిగిపోయాయని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్ బిల్లులను లెక్కల్లోకి తీసుకోవడం సరికాదని, తమ పిల్లలు పేదలా, కాదా అనేది ప్రత్యక్షంగా చూడాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి వర్గాల పిల్లల చదువును ప్రోత్సహించే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారని, పిల్లలను బడికి పంపిన ప్రతి తల్లికీ గతంలో ఏటా రూ.15 వేల చొప్పున అందించారని గుర్తు చేశారు. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అమ్మ ఒడి అందేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఏడాది కాలం తల్లికి వందనం రాలేదని, రెండో ఏడాది వస్తుందని ఎదురు చూస్తూంటే వివిధ రకాల కారణాలతో ఈ పథకాన్ని దూరం చేశారని వాపోయారు. గతంలో మాదిరిగానే పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులందరికీ తల్లికి వందనం పథకాన్ని అందించాలని కోరారు.
సంతృప్తికరమైన పరిష్కారం చూపండి
పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు ఆయా శాఖల అధికారులు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఇతర అధికారులతో కలసి ఆయన అర్జీలు స్వీకరించారు. తల్లికి వందనం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, బియ్యం కార్డు మంజూరు, కార్డులో పేర్ల మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఆన్‌లైన్‌లో భూమి వివరాల నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం ఆన్‌లైన్ తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు.

తల్లికి వంచన ఎందుకు?