
నూతన సేద్య పద్ధతులతో కోకోలో అధిక దిగుబడి
అంబాజీపేట: కోకో సాగులో నూతన సేద్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ ఎం.ముత్యాల నాయుడు అన్నారు. అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రంలో డైరెక్టర్ ఆఫ్ క్యాష్‌వేనట్ అండ్ కోకో డెవలప్‌మెంట్ ప్రోత్సాహంతో మంగళవారం కోకో సాగుపై శిక్షణ నిర్వహించారు. ముత్యాల నాయుడు మాట్లాడుతూ కోకో తోటల్లో యాజమాన్య పద్ధతులు అవలంబించాలన్నారు. కొమ్మ కత్తిరింపు, పురుగుల నియంత్రణ పద్ధతులపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకోను సాగు చేయడం వల్ల అదనపు రాబడి పొందవచ్చన్నారు. డాక్టర్ నామాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కోకో కాయ తయారయ్యే సమయంలో తోటలను రైతులు పరిశీలించి ఎలుకల బెడద ఉంటే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. హార్టికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కోకో ప్రొడక్షన్, కోకో వాల్యూ అడిషన్, ప్రోసెసింగ్ విధానాలను వివరించారు. శాస్త్రవేత్తలు బి.నీరజ, ఎ.కిరీటి, వి.అనూష తదితరులు కోకోలో సూక్ష్మపోషకాల యాజమాన్య విధానాలను తెలిపారు.