కూటమి సర్కారు.. కూకటి వేళ్లతో కదిలేలా.. | - | Sakshi
Sakshi News home page

కూటమి సర్కారు.. కూకటి వేళ్లతో కదిలేలా..

Jul 8 2025 5:22 AM | Updated on Jul 8 2025 5:22 AM

కూటమి

కూటమి సర్కారు.. కూకటి వేళ్లతో కదిలేలా..

వైఎస్సార్‌ సీపీ పిఠాపురం

సోషల్‌ మీడియా గ్రూపులు హ్యాక్‌!

పిఠాపురం: తమ సోషల్‌ మీడియా గ్రూపులను కూటమి నాయకులు హ్యాక్‌ చేశారని పిఠాపురం వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరోపించారు. గొల్లప్రోలులో జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన జనాదరణను సహించలేక కూటమి నాయకులు.. తమ సోషల్‌ మీడియా గ్రూపులకు ఏపీకే ఫైల్స్‌ పంపించారని తెలిపారు. తమ సోషల్‌ మీడియా ప్రతినిధులు అప్రమత్తమై గ్రూపులను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అణగదొక్కే కుట్రగా అనుమానం వ్యక్తం చేశారు.

గొల్లప్రోలులో కదం తొక్కిన

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు

బాబు మోసంపై విరుచుకుపడ్డ నేతలు

పార్టీ విస్తృత స్థాయి సమావేశం

సూపర్‌ సక్సెస్‌

పిఠాపురం: కూటమి ప్రభుత్వం కూకటి వేళ్లతో కదిలేలా వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు వేలాదిగా కదం తొక్కారు. సీఎం చంద్రబాబు మోసంపై విరుచుకుపడ్డారు. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి శ్రేణులను సమాయత్తం చేసే లక్ష్యంతో.. వైఎస్సార్‌ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీతా విశ్వనాథ్‌ అధ్యక్షతన గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. నేతల ప్రసంగాలు స్థానిక నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపాయి.

అబద్ధాల్లో బాబును మించిన కొడుకు

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఏ తండ్రి అయినా కొడుకు తన కంటే ప్రయోజకుడు కావాలని కోరుకుంటారని, కానీ, అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు కొడుకు మాత్రం తండ్రిని మించిన తనయుడిలా ఉన్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 100 అబద్ధాలు ఆడితే, ఆయన కుమారుడు లోకేష్‌ 200 అబద్ధాలు ఆడుతూ తండ్రిని మించిపోయారని అన్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని మంత్రి లోకేష్‌ శాసన మండలి సాక్షిగా చెప్పారని, జూన్‌ వెళ్లి జూలై వచ్చినా ఇంకా అమలు కాలేదని బొత్స దుయ్యబట్టారు. ఇలాంటి అబద్ధాలు ఆడేవారిని మోసగాళ్లు, దగాకోరులు అనాలా, వద్దా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలపై అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాట మార్చి ప్రజల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. జరిగిన మోసాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే తాటా తీస్తానని చంద్రబాబు.. మక్కెలు విరగ్గొడతానని పవన్‌ కల్యాణ్‌ అంటున్నారన్నారు. వాళ్లు తాట తీసి, మక్కెలు విరగ్గొడితే కొట్టించుకోడానికి వైఎస్సార్‌ సీపీ నేతలు కార్యకర్తలేమైనా చేతకానివారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పథకాలు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబు, పవన్‌ మోసగాళ్లు కాదా? అబద్ధపు వాగ్దానాలు చేసిన వీరిద్దరూ అబద్ధపుకోరులు కాదా?’ అని బొత్స ప్రశ్నించారు. దమ్ముంటే ఈ ఇద్దరు నాయకులూ గ్రామాలకు వెళ్లి, తాము ఇచ్చిన హామీలపై ప్రజలతో మాట్లాడాలని, ఎవరు ఎవరి తాట తీస్తారో, ఎవరి మక్కెలు ఎవరు విరగ్గొడతారో అప్పుడు తెలుస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈవిధంగా బెదిరించడం భావ్యమేనా అని ప్రశ్నించారు. చేసే సత్తా లేనప్పుడు వాగ్దానాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అడిగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అడిగిన వారిని అణగదొక్కుదామంటే ఇంకా పైకి లేచి మరింత తిరగబడతారని హెచ్చరించారు. చంద్రబాబు, పవన కల్యాణ్‌ కలసి పలు హామీలిచ్చి అమలు చేస్తామంటూ ప్రజలకు బాండు రాసిచ్చారన్నారు. ఇప్పుడు ఆ బాండ్లను ప్రజలకు చూపించి, వారిద్దరూ చేసిన మోసాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రతి కార్యకర్తా ప్రతి గ్రామంలోనూ ఇద్దరు నేతల మోసాలను వివరించి, ప్రజలను చైతన్యపరచాలని బొత్స పిలుపునిచ్చారు. మేనిఫెస్టోను కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేసేంత వరకూ రాష్ట్రంలో 40 శాతం ఓట్‌ షేర్‌ కలిగిన బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని, పోరాడుతూనే ఉంటామని చెప్పారు. దీనిని అధికార పక్షం విస్మరిస్తే మెడలు వంచి మరీ గుర్తు చేసే బాధ్యత వైఎస్సార్‌ సీపీపై ఉందన్నారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రతి నాయకుడు, కార్యకర్త కూటమి మేనిఫెస్టో అమలు చేసేంత వరకూ ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ పోరాడాలని బొత్స అన్నారు.

విచ్చలవిడిగా గంజాయి, మద్యం

పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్‌ షాపులు దర్శనమిస్తున్నాయని, మద్యం ఏరులై పారుతోందని అన్నారు. కొన్ని పత్రికల్లో మాత్రం ‘గంజాయి రహిత రాష్ట్రంగా మారింది‘ అంటూ రాయడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. గంజాయి వ్యాపారంలో ఆరితేరింది వాళ్ల నాయకులేనని, ఎకరానికి ఇంత అని కమీషన్లు తీసుకుని, గంజాయితో పాటు విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. పేపర్లలో రాయించుకోవడంపై పెట్టిన దృష్టి గంజాయి నిర్మూలనపై పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించారు. ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అన్ని హామీలూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలసి వచ్చి ప్రమాణం చేసి హామీలు అమలు చేస్తామన్నారు కాబట్టే ప్రజలు నమ్మి కూటమికి ఓట్లు వేశారన్నారు. చివరికి మోసపోయామంటూ అన్ని వర్గాల ప్రజలూ ప్రభుత్వంపై తిరగబడే రోజులు వచ్చేశాయని చెప్పారు. ఎన్నో ప్రలోభాలు, ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌ సీపీ కేడర్‌ను లాక్కునే ప్రయత్నం చేసినా ఏ ఒక్కరూ కూటమి పార్టీల వైపు చూడలేదని, అధినేత వైఎస్‌ జగన్‌, వంగా గీతలపై ఉన్న నమ్మకమే దీనికి కారణమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనీ కూటమి ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజా అన్నారు.

ఆదర్శంగా తీసుకోవాల్సింది వారిని..

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా, ముద్రగడ పద్మనాభం, బొత్స సత్యనారాయణ, వంగా గీతా విశ్వనాథ్‌ వంటి కాపు నేతలు ప్రజల కోసం పని చేసిన వారని అన్నారు. యువత ఇలాంటి నేతలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఒక సినీ హీరోను ఆదర్శంగా తీసుకుని, ఆయన వెనుక తిరుగుతున్న వారు ఒకసారి దీనిపై ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. పవన్‌ కల్యాణ్‌ తాను ముఖ్యమంత్రి కావడం కోసం పని చేస్తున్నారా.. లేక మామ కు వెన్నుపోటు పొడిచిన, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడానికి కారకులైన వ్యక్తిని సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చూసేందుకు పని చేస్తున్నారా అనేది ఆయన వెనుక ఉన్న వారు ఆలోచించుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వైఎస్సార్‌ సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని చెప్పారు. ఇవన్నీ పవన్‌ కల్యాణ్‌కు కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో గాజువాక ప్రజలు ఎడమ కాలితో, భీమవరం ప్రజలు కుడి కాలితో తంతే 2024 ఎన్నికల్లో పిఠాపురం వచ్చి పడిన పవన్‌ కల్యాణ్‌ను పిఠాపురం ప్రజలు పెద్ద మనసుతో శాసన సభకు పంపించారన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన రాష్ట్రానికి, జిల్లాకు లేదా పిఠాపురం ప్రాంతానికి గడచిన ఏడాది కాలంలో ఏం చేశారని చూస్తే గుండుసున్నా కనిపిస్తుందన్నారు. వేలాది మంది మహిళలు అదృశ్యమవుతున్నారంటూ ఎన్నికల ముందు వైఎస్సార్‌ సీపీపై, వలంటీర్‌ వ్యవస్థపై బురద జల్లిన పవన్‌.. అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారో చెప్పగలరా అని రాజా ప్రశ్నించారు. వంగా గీతా విశ్వనాథ్‌ మాట్లాడుతూ, నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి కట్టుబడి, ప్రలోభాలకూ లొంగకుండా బలమైన కేడర్‌గా ఉన్నారని కొనియాడారు. మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ, పిఠాపురంలో జనసేన విజయం తర్వాత వైఎస్సార్‌ సీపీ ఖాళీ అంటూ తప్పుడు ప్రచారం చేశారని, కానీ, వంగా గీత సారథ్యంలో పార్టీ చాలా బలంగా ఉందనడానికి ఈ సమావేశానికి పోటెత్తిన జనమే నిదర్శనమని అన్నారు. సమావేశంలో పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ముద్రగడ గిరిబాబు, దవులూరి దొరబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, మాజీ ఎంపీ గిరిజాల స్వామి నాయుడు, నేతలు కర్రి పాపారాయుడు, యనమల కృష్ణుడు, మాకినీడి శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.

కూటమి సర్కారు.. కూకటి వేళ్లతో కదిలేలా..1
1/1

కూటమి సర్కారు.. కూకటి వేళ్లతో కదిలేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement