అన్నవరం: సత్యదేవుని సన్నిధికి వస్తున్న భక్తుల్లో ఇంకా అసంతృప్తి కొనసాగుతున్నట్లు గత నెలలో ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. అయితే, మే నెలలో దాదాపు 35 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి అది 25 శాతానికి పరిమితమైంది. మే 26 నుంచి జూన్ 25వ తేదీ వరకూ రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో భక్తులకు అందుతున్న సేవలపై ప్రభుత్వం సర్వే నిర్వహించింది. అన్నవరం దేవస్థానానికి వచ్చేసరికి సత్యదేవుని దర్శనం విషయంలో మే నెలలో 68 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా జూన్ నెలలో అది 73 శాతానికి పెరిగింది. మౌలిక వసతుల కల్పనలో మే నెలలో 61 శాతం మంది, జూన్‌లో 66 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై మే నెలలో 78 శాతం మంది సంతృప్తి చెందగా జూన్‌లో అది 77 శాతంగా నమోదైంది. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి మే నెలలో 64 శాతం, జూన్‌లో 70 శాతం మంది సంతృప్తి చెందారు.
ప్రత్యేకాధికారి నిర్ణయాలు అమలు చేయాలి
భక్తుల అసంతృప్తి తగ్గించడానికి దేవస్థానం ప్రత్యేకాధికారిగా దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ వి.త్రినాథరావును నియమించిన సంగతి తెలిసిందే. ఆయన గత నెల 24న అన్నవరం దేవస్థానానికి వచ్చి, ఈఓ వీర్ల సుబ్బారావుతో కలసి టాయిలెట్ల నిర్వహణను పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా వీటిని నిర్వహించాలని ఆదేశించారు. అలాగే, పాత మెయిన్ గెస్ట్ హౌస్ వెనుక శిథిలావస్థకు చేరిన టాయిలెట్లను కూల్చివేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయాలు ఇంకా అమలు కాలేదు. మొత్తం మీద మే నెల కన్నా జూన్‌లో భక్తుల అసంతృప్తి శాతం 10 శాతం తగ్గిందని, ముందుముందు ఇంకా తగ్గేలా కృషి చేస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 627 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై 627 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, డీఆర్‌ఓ జె.వెంకటరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా శాఖల్లో నమోదైన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
రత్నగిరిపై కొనసాగుతున్న భక్తుల అసంతృప్తి