
గరళకంఠునికి దశ సహస్ర ఘటాభిషేకం
పిఠాపురం: గొల్లప్రోలు మండలం దుర్గాడలో ప్రసిద్ధిగాంచిన ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో 49 సంవత్సరాలుగా సంప్రదాయంగా వస్తున్న సహస్ర ఘటాభిషేకం సోమవారం వైభవంగా జరిగింది. ఆలయ సేవా కమిటీ సభ్యులు, అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు, పండిత బృందం ఆదిత్యశర్మ, షణ్ముఖశర్మ, కారుణ్యశర్మ, కార్తీక్‌శర్మ, దిలీప్‌శర్మ తదితరులు స్వామివారికి మహన్యాస పూర్వకంగా 11 రుద్రాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గర్భాలయానికి చెక్కలు అడ్డం పెట్టి భక్తులు 10 వేల బిందెలతో తెచ్చిన జలాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. శివలింగంపై ఉన్న గంగాదేవి మూర్తి మునిగేంత వరకూ ఈ అభిషేకం చేశారు. దశ సహస్ర ఘటాభిషేకం వలన వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని భక్తులు నమ్ముతారు. గ్రామంలోని మహిళలతో పాటు ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు కూడా గ్రామంలోని చెరువు నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి స్వామి వారికి సమర్పించారు. ఉదయం 9 గంటల నుంచి మహిళా భక్తులు బారులు తీరి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, విశేష అలంకరణ చేశారు. పలువురు భక్తులు స్వామి వారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

గరళకంఠునికి దశ సహస్ర ఘటాభిషేకం

గరళకంఠునికి దశ సహస్ర ఘటాభిషేకం