
అరుణాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ
● అట్టహాసంగా 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠ
● హాజరైన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నేతలు
ప్రత్తిపాడు రూరల్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లిలో ఆంధ్రా అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానంలో సోమవారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అరుణాచల మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన 63 మంది నాయనార్ల ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిరువణ్ణామలై అరుళ్లిగు అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానం అర్చకులు డాక్టర్ టి.అరుణాచల కార్తికేయ శివాచార్య వైభవంగా నిర్వహించారు. వీటితోపాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని జెట్టి శివకుమార్ దంపతులు, లక్ష్మీ హయగ్రీవుడు విగ్రహాన్ని శ్రీహరి రాజబాబు దంపతులు, సూర్యభగవానుడు విగ్రహాన్ని దంతులూరి సుభద్రరామరాజు దంపతులు, కాలబైరవుడు విగ్రహాన్ని గిరిధరరెడ్డి దంపతులు, గంగామాత విగ్రహాన్ని బలభద్రుడి సత్యనారాయణ దంపతుల ఆర్థిక సహాయంతో ప్రతిష్ఠించారు. అనంతరం కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగాణం మార్మోగింది. రాచపల్లి వెళ్లే ప్రధాన రహదారి భక్తులతో కిక్కిరిసిపోయింది.
భక్తి మార్గమే శరణ్యం
భక్తిమార్గమే అందరికీ శరణ్యమని తద్వారా ముక్తికి మార్గం లభిస్తుందని ధర్మపురి ఉత్తర పీఠాధిపతి సుక్కా స్వామిజీ అన్నారు. అరుణాచలక్షేత్రంలో 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వేత్త అరుణాచల మాధవి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తమిళనాడులో 5–10 శతాబ్దాల మధ్య కాలంలో నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లని చెప్పారు. వీరు భక్తి మార్గం ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు తెలిపారు. నాయనార్లలో రాజుల నుంచి మానవుల వరకు ఉన్నారని తెలిపారు. భగవంతుడిని చేరడానికి నిష్కలమషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదన్నారు. సభలో సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణాజిల్లా, పెదపులిపాక విజయ రాజేశ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వామీజీ, శ్రీరమణాసేవాశ్రమం వ్యవస్థాపకులు స్వామి రామానందతో పాటు పలువు రు ఆథ్యాత్మిక వేత్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోకల వంశీ నాగేంద్రమాధవ్, జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు చిలుకూరి రాంకుమార్, ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రు, నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

అరుణాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ