
డ్రైవింగ్‌కు లైసెన్స్ ముఖ్యం
● చదువు కోసం పోతూ చావు కొని తెచ్చుకోవద్దు
● కళాశాలకు బైక్‌పై ప్రయాణం
ప్రమాదకరం
● ఆకతాయి పనులతో అనర్థం
● సురక్షిత ప్రయాణంతో మంచి భవిష్యత్తు
కపిలేశ్వరపురం: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు నెలకావొస్తోంది. ఫలితాల వెల్లడి, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు తీసుకోవడం, పై చదువులకు కళాశాలను ఎంచుకోవడం, అడ్మిషన్ తీసుకోవడం తదితర ప్రక్రియలతో జూన్ నెల బిజీ బిజీగా సాగింది. ఇక నుంచి పాఠ్యాంశాల బోధన, అంతర్గత స్థాయి పరీక్షల నిర్వహణ తదితర వాటితో విద్యార్థులు చదువుల్లో తలమునకలు అవుతారు. కళాశాలకు వెళ్లడం ఎంత అవసరమో ఆ ప్రయాణం సురక్షితంగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవడమూ అంతే అవసరం. సురక్షిత ప్రయాణం ఆవశ్యకతపై ఈ కథనం...
పిల్లలకు వాహనాలిస్తే తండ్రిపై క్రిమినల్ కేసు
సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్, వెహికల్ డ్రైవింగ్ రూల్స్ రూపొందించారు. సినిమాలో హీరో తరహాలో వాహనాన్ని నడపాలన్న తపన వెనుక ప్రాణహాని పొంచి ఉందని గ్రహించాలి. పదో తరగతి , ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వారి వయసు రీత్యా వాహనాన్ని నడిపే అర్హత ఉండదు. 18 ఏళ్లు నిండినవారు లైసెన్స్ లేకుండా ప్రయాణాలు చేయడం సరికాదు. అలా చేస్తే రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ జరిమానా విధిస్తారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. అతిక్రమించి ఇచ్చినట్టయితే తండ్రిపై కేసు నమోదు చేస్తారు. నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. వాహనాలను నడిపేటప్పుడు నిర్లక్ష్యాన్ని విడనాడాలి. టూ వీలర్‌పై ముగ్గురు ప్రయాణం చేయడమంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. సెల్‌ఫోన్లో మాట్లాడుతూ వాహనాన్ని నడపడం నేరం.
గతంలో ప్రమాదాలకు గురైన విద్యార్థులిలా...
● 2024 ఫిబ్రవరి 15న మండపేట మెహర్‌బాబా ఆశ్రమం సమీపంలో లారీ ఢీకొని పట్టణంలోని ప్రైవేటు కళాశాలలోని సెకండ్ ఇంటర్ విద్యార్థి పడాల మధుసాయి మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు.
● 2023 ఫిబ్రవరి 26న అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం శివారు టి.సావరం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అమలాపురంలోని కళాశాలకు ప్రాక్టికల్ పరీక్షకు హాజరయ్యేందుకు బైక్‌పై వెళ్తున్న నందెపు రాజేష్ (17), అల్లపల్లి నాగేంద్ర (17) మృతిచెందారు.
● 2023 జూన్ 3న అమలాపురం మండలం నడిపూడికి చెందిన పదో తరగతి విద్యార్థి పెనుమల ప్రశాంతి (06) నడిపూడిలో మట్టి ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది.
● 2023 మే 19న అమలాపురం మహిపాల వీధికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని గంగా లక్ష్మీ జాహ్నవి (11) గాంధీనగర్ వద్ద మట్టి ట్రాక్టర్ ఢీకొని అదే రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
● 2023 డిసెంబర్ 3న మండపేట పట్టణంలోని మారేడుబాక వంతెన వద్ద కారు ఢీకొని మారేడుబాక గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి మాడెం ప్రవీణ్ (11) మృతిచెందాడు.
ఆకతాయి పనులు సైతం
అనర్థాలను తెస్తాయి
విద్యార్థులు నదిలో స్నానాలకు దిగడం, జనావాసాల్లో రాళ్లు, కర్రలు విసరడం, వాహనాలను వంకరటింకరగా నడపడం వంటి ఆకతాయి పనులకు పాల్పడటం అనర్థం తెచ్చే ప్రమాదం ఉంది. 2023 మే 21న ఆలమూరు మండలం జొన్నాడ వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన అయినవల్లి మండలం పెద్దిపాలెంనకు చెందిన ఇంటర్ విద్యార్థి మోటూరి త్రిలోక్(17), కొత్తపేట సాయిబాబా మందిర సమీప నివాసితుడైన నర్సరీ కూలి గెడ్డం కరుణకుమార్ (22) మృతిచెందారు. వారి స్నేహితుడు కోరుమిల్లికి చెందిన అయినవిల్లి భవానీశంకర్ పుట్టినరోజును జరుపుకున్న తర్వాత వారు నదిలో స్నానానికి వెళ్లారు.
నిబంధనల పర్యవేక్షణకు సహకరించాలి
రహదారులపై వెహికల్ డ్రైవింగ్ రూల్స్ పాటించడంపై అధికారులు తనిఖీలు చేస్తుంటారు. వారికి విద్యార్థులు విధిగా సహకరించాలి. లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపాలన్న ఆలోచన విడనాడాలి. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసుల కళ్లు గప్పి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లిపోవాలన్న ఆలోచన సరికాదు. విద్యార్థులను ఆటోలో తరలించేవారు 10 కిలోమీటర్ల లోపు ఉన్న విద్యాసంస్థలకు మాత్రమే తీసుకెళ్ళాలి. ఆటో నడిపే కార్మికుని పక్కన ప్రయాణికులు కూర్చోకూడదు. ఆటోకు రెండు వైపులా రక్షణ కవచం ఉండాలి. డ్రైవర్‌కు లైసెన్స్, వాహనానికి పర్మిట్ తప్పనిసరి.