
ఈ దొంగకు హీరో మోటారు సైకిళ్లు ఇష్టం!
తుని: విలాసాలకు అలవాటు పడిన పాత నేరస్తుడు ఒకే కంపెనీ మోటారు సైకిళ్లను దొంగలించడం అలవాటుగా చేసుకుని చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. 16 హీరో మోటారు సైకిళ్లను వేర్వేరు ప్రాంతాల్లో చోరీ చేశాడు. జిల్లా ఎస్పీ బింధుమాదవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ పర్యవేక్షణలో తుని పోలీసులు పెట్టిన నిఘాకు దొంగ చిక్కాడు. తుని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ గీతా రామకృష్ణ కేసుకు సంబంధించిన వివరాలను తెలియపరిచారు. అల్లూరి మన్యం జిల్లా రాజవొమ్మంగి మండలం జె.వనకరాయి గ్రామానికి చెందిన గూడవల్లి అప్పారావు ప్రసాద్ తుని అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. నిందితుడుపై గతంలో కేసులు ఉన్నాయి. తుని టౌన్, అన్నవరం, సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి ప్రకాష్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో 16 మోటారు సైకిళ్లను చోరీ చేశారు. వీటి విలువ రూ.6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒకే కంపెనీకి చెందిన మోటారు సైకిళ్లను చోరీ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించారు. కేసును ఛేదించిన తుని పట్టణ ఎస్సై జె.విజయ్‌బాబు, కానిస్టేబుల్స్ నాయుడు, కిరణ్, పెద్దాపురం ఇన్‌స్పెక్టర్ ఆర్.అంకబాబు, ఏఎస్సై శ్రీహరి, హెచ్‌సీ నారాయణమూర్తి, రాధాకృష్ణలను జిల్లా ఎస్పీ బిందుమాదవ్ అభినందించారు.
నిందితుడి అరెస్ట్, 16 బైక్‌ల రికవరీ
వీటి విలువ రూ.6 లక్షలు