
పడకేసిన పర్యాటకం
అద్దరిపేట సాగర తీరంలో ఆకట్టుకునే పంప్‌హౌస్
నీలి సంద్రం.. ప్రకృతి అందం : కాకినాడ బీచ్
● అవకాశాలు అపారం
● పట్టించుకోని ప్రభుత్వం
● కడలిలో కలసిన బీచ్‌ల అభివృద్ధి
● ఆలయ పర్యాటకంపైనా చిన్నచూపు
పిఠాపురం: ఎగసిపడే అలలతో.. సహజ సౌందర్యానికి నిలయమైన నీలి సంద్రం.. మెత్తని ఇసుక తిన్నెలు.. మనసును పరవశింపజేసే ప్రకృతి అందాలు.. మన సాగర తీరానికే సొంతం. ఇక్కడ తీసిన ఎన్నో సినిమాలు సూపర్‌డూపర్ హిట్ అయ్యాయి. సెలవు రోజులు వచ్చాయంటే చాలు.. వేలాదిగా పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు మన జిల్లాలోని సాగర తీరానికి పోటెత్తుతూంటారు. ఆవిధంగా పర్యాటకాభివృద్ధికి ఇక్కడ ఎన్నో అవకాశాలున్నాయి. ఇటువంటి జిల్లాలో పర్యాటకం కొన్నాళ్లుగా పడకేసింది.
ఎన్నో పర్యాటక ఆకర్షణలు
● కాకినాడ నుంచి తుని సమీపంలోని అద్దరిపేట వరకూ ఉన్న సాగరతీరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కాకినాడ వద్ద బీచ్ పార్కు, ఉప్పాడ బీచ్ రోడ్డు ప్రాంతం, అద్దరిపేట వద్ద సాగర తీరం, పంపు హౌస్‌లు పర్యాటక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. కార్తిక మాసాల్లో ఈ ప్రాంతాలు పిక్నిక్ స్పాట్లుగా కూడా వెలుగొందుతున్నాయి.
● ప్రధానంగా కాకినాడ కేంద్రంగా వాకలపూడి బీచ్ పార్కు, లైట్ హౌస్, కుంభాభిషేకం రేవు, కాకినాడ పోర్టు, ఫిషింగ్ హార్బర్, శిల్పారామం, ఆ పక్కనే గెస్ట్ హౌస్, కాకినాడ శివారు జగన్నాథపురంలో ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ వారు నిర్మించిన చర్చిలు పర్యాటకంగా పేరొందాయి. వీటికి పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.
● కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్ సముద్రం మధ్యలో సహజంగా ఏర్పడిన ద్వీపం. ప్రస్తుతం ఇది మంచి పిక్నిక్ స్పాట్‌గా మారింది. ఇక్కడకు వెళ్లేందుకు కాకినాడ హార్బర్, కోరంగి మడ అడవుల నుంచి రవాణా సౌకర్యాలున్నాయి.
● తాళ్లరేవు మండలంలోని మడ అడవులు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి లొకేషన్లు పర్యాటకులనే కాదు.. సినీ ప్రముఖులను సైతం ఆకర్షిస్తున్నాయి. కడలి కెరటాలు, పచ్చని చెట్లు, ఇసుక తిన్నెలు, మధ్యలో కాలువల వంటి ప్రకృతి అందాలు ఎక్కడో సముద్రం మధ్య ఉన్న దీవులను తలపిస్తూంటాయి.
● ప్రత్తిపాడు మండలంలోని ఎరకంపాలెం శంఖవ రం మండలం ఆంధ్రా శబరిమలై తదితర ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తూంటాయి.
● వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు, దర్శనీయ ప్రదేశాలు, కొడవలి బౌద్ధ స్థూపాలు, చారిత్రక ప్రాంతాలు జిల్లాలో కొలువై ఉన్నాయి.
● తలుపులమ్మ లోవ, అన్నవరం సత్యదేవుడు, సా మర్లకోట భీమేశ్వరస్వామి, పిఠాపురం పాదగయ, పెద్దాపురం మండలం తొలి తిరుపతిలో వెలసిన శృంగార వల్లభ స్వామి, కాకినాడ బాలాత్రిపుర సుందరి అమ్మవారు తదితర ఆలయాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూంటారు.
● దేశవిదేశాల నుంచి జిల్లాకు ఏటా దాదాపు 25 లక్షల మంది పర్యాటకులు వస్తున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో..
జిల్లావ్యాప్తంగా ఎక్కడెక్కడ బీచ్‌లు అభివృద్ధి చేయవచ్చో అధ్యయనం చేయాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ మేరకు ఫిషరీస్ యూనివర్సిటీ, పర్యాటక, మత్స్యశాఖల ప్రతినిధులతో బృందాన్ని నియమించింది. ఇప్పటికే కాకినాడలో బీచ్ ఉండగా.. జిల్లాలోని మరో 21 ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌లను ప్రత్యేంగా అభివృద్ధి చేయవచ్చని ఆ బృందం గుర్తించింది. ఈ 22 బీచ్‌ల అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రతిపాదించింది. దేశంలో 10 బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్‌లు ఉండగా.. మన రాష్ట్రంలో విశాఖ రుషికొండ బీచ్ ఆ జాబితాలో స్థానం సాధించింది. అటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్‌ను కోస్టల్ జోన్ రెగ్యులేషన్ నోటిఫికేషన్ ప్రకారం కాకినాడలో ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బ్లూ ఫ్లాగ్ బీచ్‌లకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు కూడా. పర్యావరణం, స్నానపు నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, సందర్శకుల భద్రత తదితర 33 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే బీచ్‌లకు అంతర్జాతీయ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్లు ఇస్తుంది. ఆవిధమైన గుర్తింపు లభిస్తే కాకినాడ సాగరతీరం మరో గోవాను తలపించేలా అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు ఆశించారు. దీనివలన స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు సేవలు, పర్యాటక రంగం ద్వారా ప్రభుత్వానికి దండిగా ఆదాయం లభిస్తుందని భావించారు. ఈలోగా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడంతో బీచ్‌ల అభివృద్ధి కడలిలో కలిసిపోయింది. జిల్లాలో ఇప్పటికే ఉన్న పర్యాటక ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు కొత్త ప్రాంతాలను సైతం తీర్చిదిద్ది, మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
అభివృద్ధికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన బీచ్‌లు
సాగర సంబరాల బీచ్ (బ్లూ ఫ్లాగ్), ఎన్‌టీఆర్, నేవల్ ఎన్‌క్లేవ్, నేమాం బీచ్, హోప్ ఐలాండ్, దానవాయిపేట బీచ్, గడ్డిపేట, అద్దరిపేట, పంపాదిపేట, యర్రయ్యపేట, అన్నయ్యపేట, ఎల్లయ్యపేట, నర్సిపేట, తలపంటిపేట, కె.చోడిపల్లిపేట, కోనపాపపేట, కుంభాభిషేకం, పెరుమాళ్లపురం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్, ఉప్పాడ బీచ్, కోరంగి మడ అడవులు, యానాం బీచ్‌లు.

పడకేసిన పర్యాటకం

పడకేసిన పర్యాటకం