
మాటకు కట్టుబడిన ఘనత జగన్‌దే..
● ఆయన అభివృద్ధి కంటికి కనిపిస్తోంది
● చంద్రబాబువి కల్లబొల్లి మాటలే..
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా
తుని: ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి, దానిని వంద శాతం అమలు చేసిన ఘనత వైఎస్సార్ సీపీ అధినేత, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కంటికి కనిపిస్తోందని, చంద్రబాబు పాలనలో మోసం, దగా మాత్రమే ఉన్న విషయాన్ని ఏడాది పాలనలోనే ప్రజలు గమనించారని చెప్పారు. వైఎస్సార్ సీపీ తుని నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన స్థానిక సాయి వేదికలో శనివారం జరిగింది. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు డీవీ సూర్యనారాయణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజా మీడియాతో మాట్లాడుతూ, ధనికులు, ఉద్యోగులు చెల్లించే ఆదాయ పన్ను 20 శాతం ఉంటే పేద, మధ్య తరగతి ప్రజలు 80 శాతం కడుతున్నారని అన్నారు. మార్కెట్లో కొనే ప్రతి వస్తువుపై జీఎస్‌టీ పేరిట ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), నాన్ డీబీటీ విధానంలో ప్రజలకు నేరుగా పథకాలు అందిస్తే.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటూ చంద్రబాబు, లోకేష్ విష ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో తండ్రీకొడుకులిద్దరూ ఇంటింటికీ సంక్షేమ పథకాలు, కుటుంబానికి ఏడాదికి ఎంత లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ బాండ్లు పంపిణీ చేశారని, అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపించారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్‌లో రెండు పథకాలు మాత్రమే ప్రజలకు ఇచ్చారని, మిగిలిన వాటి జోలికి వెళ్లలేదని అన్నారు. తమ మాటలను ప్రజలు నమ్మరనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్‌తో చెప్పించారని, అందువలన పథకాల అమలు బాధ్యతను ఆయన తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పర్యటనలకు వెళ్లినప్పుడు ఇల్లు కట్టుకున్నావా అని అక్కడ ఓ మహిళను ప్రశ్నించి, లేదని చెబితే తాను రూ.3.30 లక్షలిస్తాను కట్టుకోమంటున్నారని, దీనినిబట్టి నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 ఇళ్లు మాత్రమే చంద్రబాబు కడతారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి, తొలి విడతలో 18 లక్షల ఇళ్లు పూర్తి చేశారని గుర్తు చేశారు. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారని, దమ్ముంటే జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియాన్ని రద్దు చేయాలని రాజా సవాల్ చేశారు. నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులకు ప్రభుత్వ పథకాలు ఇవ్వొద్దంటూ అధికారులకు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హుకుం జారీ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయని, దమ్ముంటే ఆపాలని సవాల్ విసిరారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలిస్తారని, అటువంటప్పుడు ‘పచ్చ’పాతం ఎందుకని ప్రశ్నించారు. ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు అందనందువలన ప్రజలు ఎంత నష్టపోయారో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు రాజా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ మేరుగ పద్మలత, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, నేతలు యనమల కృష్ణుడు, లాలం బాబ్జీ పాల్గొన్నారు.
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న దాడిశెట్టి రాజా