
ధనదైన్యాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణగా ఖ్యాతినొందిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రైతులు పీకల్లోతు దైన్యంలో కూరుకుపోయారు. రబీ ధాన్యం డబ్బుల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న తీరని జాప్యం అన్నదాతలకు శాపంగా మారింది. ఒకటీ రెండూ రోజులు కాదు.. ఒకరో ఇద్దరో రైతులూ కారు.. వందా రెండు వందల రూపాయలు అంతకంటే కాదు.. ఏకంగా రెండు నెలలుగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం రూ.399 కోట్ల మేర ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే సమయంలో ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైపోయింది. ఈ నెల 15లోగా నారుమళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదు. మరోవైపు గత వైఎస్ జగన్ ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కూడా అందించడం లేదు. పైగా ఈ పథకం పేరును అన్నదాతా సుఖీభవగా మార్చి రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో గొప్పగా చెప్పారు. కానీ, ఇప్పటి వరకూ నయాపైసా కూడా ఇవ్వలేదు. దీంతో, సాగు పెట్టుబడి కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. ప్రభుత్వమే నెలల తరబడి ధాన్యం సొమ్ము తొక్కిపెడితే ఖరీఫ్ సాగు ఏవిధంగా చేయగలమంటూ శాపనార్థాలు పెడుతున్నారు.
గొప్ప చెప్పి.. చిప్ప చూపి..
ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు కూటమి నేతలందరూ ధాన్యం అమ్మిన 24 లేదా 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామమని గొప్పగా చెప్పారు. మంత్రి నాదెండ్ల అయితే ధాన్యం కొనుగోళ్లు జరిగిన సమయంలో ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ ధాన్యం సొమ్ముపై రైతులకు ఆశలు కల్పించారు. కొనుగోళ్లు ప్రారంభమైన తొలి పక్షంలో మాత్రం ప్రచారార్భాటం కోసం రైతుల ఖాతాల్లో సొమ్ము వేశారు. మే మొదటి వారం నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రం డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో, కడుపు మండిన అన్నదాతలు ధాన్యం సొమ్ము కోసం ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అంతే కాకుండా, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు, నిడదవోలు రూరల్, ఉండ్రాజవరం, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్; కాకినాడ జిల్లా పెద్దాపురం; కోనసీమ జిల్లా అమలాపురం తదితర ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు.
రైతులు తక్కువలో తక్కువ ఎకరాకు 50 బస్తాల (75 కేజీలు) దిగుబడి సాధించారు. ఈ మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ప్రతి రైతుకు ఎకరానికి రూ.86 వేలు పైగా రావాలి. ఈవిధంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం రూ.399 కోట్ల మేర ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇది ఓవైపు ఖరీఫ్ ఖరీఫ్ సాగు ప్రారంభమైపోయినా ధాన్యం బకాయిల చెల్లింపుపై ప్రభుత్వ పెద్దల నుంచి ఉలుకూపలుకూ లేదు. కాకినాడలో బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సైతం ప్రభుత్వ నిర్లక్ష్యంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు.
అప్పు పుట్టక..
కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి దాదాపు అన్ని వర్గాల వద్ద డబ్బుల్లేని దుస్థితి నెలకొంది. ఏటా పంట పెట్టుబడిలు సమయంలో సొమ్ము సర్దుబాటు చేసే కమీషన్ ఏజెంట్లు కూడా ఈసారి చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అప్పు పుట్టడం లేదు. ఖరీఫ్‌కు సమాయత్తమయ్యే తరుణంలో రైతులు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని రైతు నేతలు మండిపడుతున్నారు.
జిల్లాల వారీగా రబీ ధాన్యం బకాయిలు
కాకినాడ రూ.80 కోట్లు
కోనసీమ రూ.189 కోట్లు
తూర్పు గోదావరి రూ.130 కోట్లు
మొత్తం రూ.399 కోట్లు
నెలలు గడుస్తున్నా ధాన్యం డబ్బులు ఇవ్వని సర్కారు
ఉమ్మడి జిల్లాలో మొత్తం బకాయి రూ.399 కోట్లు
ఖరీఫ్ పెట్టుబడికి రైతుల అగచాట్లు
ధాన్యం సొమ్ము ఇస్తారా..
ఇవ్వరా అని ప్రశ్న
ధాన్యం అమ్మి 6 వారాలైనా..
రబీలో ఆరెకరాలు సాగు చేశాను. ధాన్యం 75 కిలోల బస్తాకు ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.1,725 కంటే వ్యాపారులు తక్కువకు అడుగుతున్నారని రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) ద్వారా ప్రభుత్వానికి విక్రయించాను. మే నెలలో 70 కిలోల ధాన్యం బస్తాలు 260 తూచాను. మద్దతు ధర ప్రకారం రూ.4,18,600 రావాలి. మా బ్యాంక్ అకౌంట్లకు ధాన్యం డబ్బులు 24 గంటల్లో జమవుతాయంటే అమ్మాను. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆర్‌ఎస్‌కే, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాను. తొలకరి సీజన్ ప్రారంభమైపోయింది. విత్తనాలకు, నారుమడి దమ్ముకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఒకవైపు చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాతా సుఖీభవ పథకం అమలు కాక, ధాన్యం లెక్క (డబ్బులు) అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒకవైపు కుటుంబ ఖర్చులు, మరోవైపు తొలకరి పెట్టుబడులకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. వెంటనే ధాన్యం డబ్బులు ఇవ్వాలి.
– వెలుగుబంట్ల రవినాయుడు, రైతు, కూరాడ, కరప మండలం
దారుణం
ధాన్యం విక్రయించిన 40 రోజులు గడచినా ఇప్పటి వరకూ నయాపైసా కూడా చేతికి రాలేదు. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సహాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పింది. ఏడాది గడచినా ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఇటు ధాన్యం డబ్బులు, అటు పెట్టుబడి సాయం ఇవ్వపోతే రైతులు ఖరీఫ్ పంటలు ఎలా పండించగలరు? పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయం చేయడం కష్టంగా మారుతుంది. ఒకవైపు అతివృష్టి, అనావృష్టితో రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉంటే ధాన్యం అమ్మిన సొమ్ము కూడా ఇవ్వకపోవడం దారుణంగా ఉంది.
– వెలమర్తి బుల్లిరాజు, రైతు,
వీకే రాయపురం, సామర్లకోట మండలం

ధనదైన్యాలు

ధనదైన్యాలు

ధనదైన్యాలు