
పోలవరంపై సీఎం పచ్చి అబద్ధాలు
ఫ డయాఫ్రం వాల్
నాశనానికి చంద్రబాబే కారణం
ఫ జగన్ హయాంలో గేట్లు సహా అత్యధిక శాతం పనులు పూర్తి
ఫ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
తాళ్లపూడి (కొవ్వూరు): పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మండిపడ్డారు. తాళ్లపూడి మండలం మలకపల్లిలో మంగళవారం జరిగిన పర్యటన సందర్భంగా సీఎం చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో కుడి, ఎడమ కాలువలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు పూర్తి చేశారని గుర్తు చేశారు. అనంతరం 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో కేవలం ఒక గేటు పెట్టి, ప్రాజెక్టును చూడటానికి జనాన్ని బస్సుల్లో తరలించి, వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృథా చేశారని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుకు అన్ని గేట్లూ పెట్టారని, ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకూ పూర్తి చేశారని చెప్పారు. దీనిని కావాలనే విస్మరించి, జగన్ హయాంలో కేవలం 4 శాతం పనులే జరిగాయని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఏడాదిలో 6 శాతం పనులు పూర్తి చేశామంటున్నారని, అదే సమయంలో ప్రాజెక్టు 82 శాతం పూర్తయ్యిందంటున్నారని, అటువంటప్పుడు ఇదంతా ఎవరి హయాంలో జరిగినట్లని వెంకట్రావు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నాశనమవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. పోలవరం సందర్శనకు రూ.500 కోట్ల ప్రజాధనం వృథా చేశారన్నారు. చంద్రబాబుకు డబ్బులు, క్రెడిట్ దక్కించుకోవడం తప్ప పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభంలో శీనయ్య కమిటీ రెండు డయాఫ్రం వాల్స్ కట్టాలని సూచించినప్పటికీ చంద్రబాబు ఒక్కటి మాత్రమే నిర్మించారని విమర్శించారు. అది కూడా ఒకచోట 52 మీటర్లు, మరోచోట 92 మీటర్ల మేర ఇష్టారాజ్యంగా నిర్మించారని చెప్పారు. డయాఫ్రం వాల్ పునాది కచ్చితంగా హార్డ్ రాక్ వరకూ వెళ్లాలని అధికారులు సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. అందువల్లనే నేడు ఈ దుస్థితి నెలకొందని, చేసిన తప్పు ఒప్పుకొని లెంపలేసుకోవాల్సింది పోయి, ఆ తప్పును జగన్‌పై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
పింఛన్ల పంపిణీకి రూ.కోట్లు దుర్వినియోగం
గత ప్రభుత్వంలో ప్రతి నెలా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తే.. నేడు ప్రతి నెలా చంద్రబాబు తన ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండానే అమలు చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కొత్త పథకాలు ప్రారంభించడానికి మాత్రమే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలు పెట్టేవారని, కానీ నేడు ప్రతి దానినీ చంద్రబాబు ప్రచారార్భాటానికి వాడుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాల్లో రౌడీలు ఉన్నారంటున్నారని, ఆయన పార్టీలో ఎంత మంది రౌడీలున్నారని ప్రశ్నించారు. పైగా ఇసుక, మద్యం, మట్టి, మైనింగ్ మాఫియాలుగా మారి ప్రజాధనాన్ని దోచుకుంటున్నది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంపై దాడులు చేసి కేసులు పెడుతున్నది ఈ ప్రభుత్వం కాదా అని వెంకట్రావు నిలదీశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,683 కోట్లు ఖర్చు చేసి 72 శాతం పైగా పూర్తి చేశామని 2024 జూన్‌లో చెప్పారు. పోలవరం అంచనా రూ.55,549 కోట్లు అయినప్పుడు రూ.13,683 కోట్లు అంటే 24 శాతం ఖర్చు చేసి 72 శాతం పూర్తి చేశానని ఎలా అన్నారు? అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. జనాన్ని నమ్మించడానికే ఈ కట్టు కథలు చెబుతున్నారు.