
నారుకు నీరు కరవు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘ఈ ఏడాది మూడు పంటలు పండించాలి. రైతులంతా ముందస్తు సాగుకు సమాయత్తం కావాలి. జూన్ 15లోపు నారుమళ్లు వేసుకోవాలి. జూలై నెలాఖరుకు నూటికి నూరుశాతం నాట్లు పూర్తి కావాలి’ అంటూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరూవాడా ముందస్తు సాగు, ముందస్తు సాగు అంటూ చేస్తోన్న ప్రచారం అంతా ఇంతా కాదు. బాబు మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఖరీఫ్ ముందస్తు కార్యాచరణ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. జిల్లాలో ఏ ఒక్క ఆయకట్టులోను ముందస్తుకు సాగునీరు దరి చేరలేదు. నారు పోద్దామంటే నీరు లేక బీడువారిన భూములను చూసి రైతుల గుండె తరుక్కుపోతోంది. కాలువ శివారు ఆయకట్టు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ముందస్తు సాగు కోసం జూన్ ఒకటో తేదీ నాటికే పంట కాలువల్లో నీటిని విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికే పక్షం రోజులు దాటిపోయింది. అయినా పొలాల్లోకి చుక్క నీరు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ముందస్తు, ఏటా మూడు పంటలు అంటూ ప్రభుత్వం ఆర్భాటం ఎందుకు చేస్తోందో అర్థం కావడం లేదని రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ఖరీఫ్ సీజన్‌లో రైతులు 60 నుంచి 70శాతం సొంతంగా నారు వేసి నాట్లు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్‌లో సైతం రైతులు ఇందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకు తగ్గట్టు సాగునీరు అందక నానా ఇబ్బందులు పడుతూ వర్షాలు, బోర్లు ఆధారంగా నారు పోసుకుంటున్నారు.
కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 91,300 హెక్టార్లలో వరి సాగు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ రూపొందించిన కార్యాచరణలో పేర్కొంది. ఇందులో 57,760 హెక్టార్లలో ఎంటీయూ 7029, ఎంటీయూ 1318, 33,540 హెక్టార్లలో ఆర్‌జేఎల్ 2537, బీపీటీ 5204, హైబ్రీడ్ రకాలు సాగు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం అన్ని రకాలు కలిపి 45,939 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశామని వ్యవసాయశాఖ చెబుతోంది. జిల్లాలో అత్యధికంగా గోదావరి కాలువపై ఆధారపడి 47,928 హెక్టార్లలో వరి సాగుకు సమాయత్తం అవుతున్నట్టు వ్యవసాయశాఖ ప్రకటించింది.
దమ్ము చేయడానికి అవస్థలు
ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ కాగితాల్లో భద్రంగా ఉంది. ఆచరణలో మాత్రం మూడడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా కనిపిస్తోంది. అసలు నీరే లేకుండా చంద్రబాబు చెబుతున్నట్టు ముందస్తు సాగు ఎలా గట్టెక్కుతుందని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో గోదావరి కాలువపై ఆధారపడి సాగుకు సమాయత్తమయ్యే పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలంలోని పలు గ్రామాల్లోని ఆయకట్టుకే నీరు పారడం లేదు. వీకే రాయపురం, మాధవపట్నం, ఉంగటూరు, అచ్చంపేట తదితర ప్రాంతాల్లోని ఆయకట్టులో నారుమళ్లకు దమ్ములు చేద్దామంటే నీరు అందడం లేదని రైతులు మదనపడుతున్నారు. పిఠాపురం బ్రాంచి కెనాల్(పీబీసీ)లో నవర, చంద్రంపాలెం, పవర తదితర శివారు ఆయకట్టులో ముందస్తు ఖరీఫ్ అసలు సాధ్యమే కాదంటున్నారు. పెదబ్రహ్మదేవం, జి మేడపాడు, వేట్లపాలెం తదితర ఆయకట్టు రైతులు ఇప్పుడిప్పుడే దమ్ములు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
శివారులకు అందని నీరు
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో అంతా దాదాపు శివారు ఆయకట్టే. ఇక్కడ 15వేల ఎకరాల ఆయకట్టు కాలువలకు శివారున, సముద్ర తీరాన ఉంది. కాలువలకు సాగునీరు విడిచిపెట్టి పక్షం రోజులు దాటిపోయినా ఇంతవరకు పంట పొలాలకు నీరు రాలేదు. ఖరీఫ్‌లో ముందస్తు సాగుకు సమాయత్తం కావాలని వ్యవసాయశాఖ చెబుతున్నా పొలాల్లోకి నీరు పారకుండా సాగు ఎలా ముందుకు వెళుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట పొలాల్లోకి నీరు రాకపోవడం ఒక సమస్యకాగా, పంట కాలువలు, మురుగు కాలువలు గురప్రు డెక్క, పూడికతో పేరుకుపోయాయి. ఇప్పటికీ కాలువల్లో సాగునీరు రాకపోగా మూసుకుపోయిన పంట, మురుగుకాలువలతో చంద్రబాబు చెబుతున్నట్టు ముందస్తు సాగు ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేఎం జే కెనాల్, న్యూ భీమన్నకర్రకాలువ, గరువు కాలువ, రావువారి కాలువ, మెరక, వెల్ల నార్త్ కెనాల్, తుల్యభాగ, శహపురం, కూరాడ, జెడ్.భావారం, జి.భావారం, యండమూరు, వెంకటప్పయ్య, రాజు డ్రెయిన్లు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. కాలువలు కట్టేసిన నెలరోజులు ఏమీ చేయకుండా నీరు విడుదలైన తరుణంలో డ్రైన్‌లలో పూడిక, గుర్రపు డెక్క తొలగింపు పనులు హడావుడిగా చేసి కూటమి నేతలు జేబులు నింపుకునే పనిలో బిజీగా ఉన్నారు.
ఏలేరు ఆయకట్టుకు ఎప్పుడిస్తారో?
ఏలేరు కింద సాగయ్యే సుమారు 50వేల ఎకరాల్లో ఆయకట్టుకు ఇంకా సాగునీరు విడుదల చేయలేదు. సరికదా ఎప్పుడు నీరిస్తారో కూడా చెప్పడం లేదు. ఏలేరు పరిధిలో గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కాలువలు కట్టేసి నెలరోజులైంది. ఈ సమయంలో క్లోజర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఏలేరు గండ్లు పూడ్చివేత పనులు ఇప్పుడు హడావుడిగా మొదలు పెడుతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధి ఆయకట్టుకు గోదావరి నీటిని విడుదల చేశారు. కానీ ఉప్పాడకొత్తపల్లి మండలం రమణక్కపేట, నాగులాపల్లి, శ్రీరామపురం సహా తొండంగి మండలంలో పలు ప్రాంతాల ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరు పారలేదు. పుష్కర, పంపా, తాండవ ఆయకట్టు పరిస్థితి ఇందుకు భిన్నమేంకాదు. పొలాలకు సాగునీరు పారకుండా ముందస్తు సాగు ఎలా చేస్తామని రైతులు నిలదీస్తున్నారు.
‘బాబు’ ముందస్తు డాబు మాటలు
కాలువలకు నీరిచ్చి పక్షం రోజులు
అయినా పొలాలకు చేరని వైనం
ఖరీఫ్ ముందుకు సాగేదెలా?
అధ్వానంగా డ్రైన్‌లు

నారుకు నీరు కరవు

నారుకు నీరు కరవు

నారుకు నీరు కరవు