
ప్రత్యంగిర హోమానికి బ్రేక్
● సత్యదేవుని కల్యాణోత్సవాల
పేరిట నిలుపుదల
● గతంలో ఎప్పుడూ ఇలా లేదని
భక్తుల అసంతృప్తి
అన్నవరం: రత్నగిరి వన దేవత వనదుర్గ అమ్మవారికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా నిర్వహించాల్సిన ప్రత్యంగిర హోమం సోమవారం నిర్వహించలేదు. సత్యదేవుని కల్యాణోత్సవాల సందర్భంగా పలు వైదిక కార్యక్రమాలు నిలుపు చేసిన దేవస్థానం అధికారులు ఈసారి కొత్తగా వనదుర్గ అమ్మవారి హోమాలు కూడా నిలిపివేశారు. గత శుక్రవారం చండీ హోమం, తాజాగా ప్రత్యంగిర హోమం నిర్వహించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గతంలో 2019 నుంచి 2024 వరకూ దేవదాయ శాఖ అధికారులే అన్నవరం దేవస్థానం ఈఓలుగా వ్యవహరించారు. అప్పట్లో ఏ సంవత్సరంలోనూ సత్యదేవుని కల్యాణోత్సవాల పేరిట ఈ హోమాలు నిలిపివేయలేదు. 2019 కల్యాణోత్సవాలకు దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ పి.సురేష్‌బాబు, 2021, 2022 సంవత్సరాల్లో వి.త్రినాథరావు, 2023లో చంద్రశేఖర్ ఆజాద్, గత ఏడాది కల్యాణోత్సవాల సమయంలో ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈఓలుగా పని చేశారు. వీరి హయాంలో వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలు యథావిదిగా జరిగాయి. ఏటా వైశాఖ పౌర్ణమి సందర్భంగా జరిగే సత్యదేవుని చక్రస్నానం నాడే ప్రత్యంగిర హోమం నిర్వహించేవారు. చక్రస్నానం అనంతరం ప్రత్యంగిర హోమం పూర్ణాహుతిలో అప్పట్లో ఈఓలు పాల్గొనేవారు. 2021లో సత్యదేవుని చక్రస్నానం, వనదుర్గ అమ్మవారి ప్రత్యంగిర హోమం పూర్ణాహుతిలో అప్పటి ఈఓ త్రినాథరావు దంపతులు పాల్గొన్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు చెందిన వీర్ల సుబ్బారావు ఈఓగా ఉన్నారు. ఈ ఏడాది హోమాలు నిలిపివేయడం ద్వారా కొత్త సంప్రదాయం నెలకొల్పారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చైర్మన్ పట్టించుకోవాలి
రత్నగిరిపై సత్యదేవుని ఆవిర్భావం నుంచి కొద్ది కాలం ఇతరులు చైర్మన్లుగా ఉన్నా గత 135 సంవత్సరాలుగా వ్యవస్థాపక ధర్మకర్తలు, చైర్మన్లుగా దాదాపు ఇనుగంటి వంశీకులే వ్యవహరిస్తున్నారు. రాజా ఇనుగంటి వేంకట రామారాయణం, రాజా ఇనుగంటి ప్రకాశరావు, ఇనుగంటి గోపాలరావు, తరువాత రాజా ఐవీ రామ్‌కుమార్ ధర్మకర్తలుగా వ్యవహరించారు. వారందరూ దేవుని కార్యక్రమాలకు ఏ లోటూ రానిచ్చేవారు కాదు. పూజలు, హోమాలు ఏవి నిలుపు చేసినా ఊరుకునేవారు కాదు. ప్రస్తుతం ఇనుగంటి వంశంలో ఐదో తరానికి చెందిన ఐవీ రోహిత్ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఏటా స్వామివారి కల్యాణోత్సవాల్లో యథావిధిగా జరిగే వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలు నిలిపివేస్తే ఆయన పట్టించుకోకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అమ్మవార్లకు అపచారం జరుగుతూంటే ఎందుకు అడ్డుకోవడం లేదని, ఇప్పుడైనా ఆయన పట్టించుకుని, పరిస్థితిని చక్కదిద్దాలని భక్తులు సూచిస్తున్నారు.