బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు | - | Sakshi
Sakshi News home page

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు

May 22 2025 12:20 AM | Updated on May 22 2025 12:20 AM

బాబొచ

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇంటింటికీ రేషన్‌ పథకానికి కూటమి సర్కార్‌ మంగళం పాడేస్తోంది. నాడు చంద్రబాబు హయాంలో పడ్డ రేషన్‌ కష్టాలు మరో 10 రోజులలో తిరిగొచ్చేస్తున్నాయి. రేషన్‌ తీసుకోవడానికి చౌకధరల దుకాణాల వద్ద ప్రజలు పడుతున్న కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసి చలించిపోయిన జగన్‌మోహన్‌రెడ్డి ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ సరఫరాకు శ్రీకారం చుట్టారు. దాదాపు ఐదేళ్ల పాటు ఇంటి ముంగిటకే అందించిన రేషన్‌ ఇక ఇంటికి రాదని తెలిసిన దగ్గర నుంచి కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చౌకధరల దుకాణాల డీలర్లు తమకు నచ్చిన సమయాల్లో రేషన్‌ సరకులు సరఫరా చేసే పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతోనే నాడు జగన్‌ కార్డుదారుల ఇంటి ముంగిటకే ఎండీయూ వాహనాలను తీసుకువచ్చారు. రేషన్‌కార్డుదారులకు సౌకర్యంతో పాటు ఎండీయూ వ్యవస్థ ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించారు. అటువంటి ఎండీయూ వ్యవస్థ ఒప్పంద కాలపరిమితి ఏడాదిన్నర ఉండగానే చంద్రబాబు సర్కార్‌ మంగళవారం కేబినెట్‌ భేటీలో తీసుకున్న రద్దు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

సర్కారు నిర్వాకాన్ని తప్పు పడుతున్న జనం

రేషన్‌కార్డు అంటేనే నిరుపేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసం ఉద్దేశించింది. అటువంటి వారి ఇళ్ల ముంగిటకు నేరుగా వెళ్లి రేషన్‌ సరకులను అందిస్తున్న మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ)వాహనాలను రద్దు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఒకప్పుడు రేషన్‌ తీసుకోవడానికి చౌకధరల దుకాణాల వద్ద క్యూ లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులను చవి చూసిన జనం ఎండీయూ వాహనాలు వచ్చాక చాలా సంతోషంగా ఉన్నారు. గడచిన ఐదేళ్లుగా దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చిన్నా, చితకా పనులు చేసుకునే వారి దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబాలు ఇంటి ముంగిటకే రేషన్‌ సరకులు వచ్చేస్తుండటంతో సంబరపడ్డారు. రేషన్‌ దుకాణాల వద్ద నిరీక్షించడంతో సామాన్యుల జీవనోపాధి దెబ్బతింటుందనే ఉద్దేశంతో తీసుకువచ్చిన వ్యవస్థను లేకుండా చేస్తున్న కూటమి సర్కార్‌ నిర్వాకాన్ని ప్రజలు తూర్పార పడుతున్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటి నుంచి 17 తేదీ వరకూ ఎండీయూ ఆపరేటర్లు కచ్చితంగా ఇంటికి వచ్చి రేషన్‌ ఇస్తారనే భరోసా కల్పించారు. ఇప్పుడు ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా గత ప్రభుత్వ పథకాలు ఉండకూడదనే కూటమి దుర్బుద్ధి బయట పడిందంటున్నారు. కాకినాడ జిల్లాలో 515 గ్రామ సచివాలయాల పరిధిలో 6.43 లక్షల రేషన్‌కార్డులు ఉంటే 1,060 రేషన్‌ దుకాణాలున్నాయి. ఈ కార్డుదారులకు ఇంతవరకు 428 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ సరకులు అందిస్తున్నారు. అటువంటి ఎండీయూ వ్యవస్థను ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేస్తామనడమంటే ప్రజలకు తిరిగి కష్టాలు చూపించడమేనంటున్నారు.

గత ప్రభుత్వంలో ఒక్కొక్క వాహనానికి డ్రైవర్‌, ఆపరేటర్‌, హెల్పర్‌ పోస్టులను మంజూరు చేసి జిల్లాలో 1,284 మంది నిరుద్యోగులకు ఉపాధి చూపించారు. అలాగని రేషన్‌ డీలర్లను తొలగించకుండా వారి ఉపాధికి భంగం కలగకుండా నెలనెలా కమీషన్‌తో పాటు, గోనె సంచులను కూడా డీలర్లకే అప్పగించేవారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడమంటే వందలాది మంది ఆపరేటర్లను రోడ్డున పడేయడమే. ఎండీయూ వాహన వ్యవస్థను అమలులోకి తెచ్చినప్పుడు జిల్లాలో పౌరసరఫరాలశాఖ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌లు, బ్యాంక్‌ ఆఫ్‌బరోడా, ఎండీయూ వాహనాల ఆపరేటర్‌ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కుదిర్చిన ఒప్పందం గడువు ఇంకా ఏడాదిన్నర ఉంది. ఒక ఎండీయూ ఆపరేటర్‌కు ఇచ్చే రూ.18వేలులో డీజిల్‌కు రూ.3,000, హెల్పర్‌కు రూ.5,000 పోతే మిగిలే రూ.10వేలతో ఆపరేటర్‌ కుటుంబం జీవనోపాధి పొందేది. వాహనాలకు ఒప్పంద గడువు ఉండగానే ఈ వ్యవస్థ రద్దు చేయడం ద్వారా ఇన్ని వందల కుటుంబాల ఉసురుపోసుకుంటోందని ప్రభుత్వంపై వారు నిప్పులు చెరుగుతున్నారు. నెలకు రూ.10వేల జీతం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి మొత్తం వలంటీరు వ్యవస్థనే రద్దు చేసిన కూటమి సర్కార్‌ ఇప్పుడు రద్దుల పద్దులో ఇంటింటికీ రేషన్‌ సరఫరా ఎండీయూ వాహనాలను చేర్చి వారిని రోడ్డున పడేస్తోంది.

ఇంటింటికీ సరకుల

పంపిణీకి మంగళం

రేషన్‌ దుకాణాల వద్ద నిరీక్షణ తప్పదు

రోడ్డున పడనున్న

ఎండీయూ వాహనదారులు

జగన్‌ పుణ్యాన ఐదేళ్లూ

ఇంటి ముంగిటకే సరకులు

రేషన్‌ కోసం పని మానుకోవాల్సి వస్తుంది

వచ్చే నెల నుంచి ఇంటింటికీ తీసుకొచ్చే రేషన్‌ బళ్లు రద్దు చేయడం మంచిది కాదు. చౌకధరల దుకాణానికి వె ళ్లి గంటలకొద్దీ లైన్‌లో నిలబడాల్సి ఉంటుంది. సిగ్నల్స్‌ లేకపోతే ఒక్కోసారి ఒకపూట పడుతుంది. రేషన్‌కోసం ఒకరోజు పని మానుకోవాల్సి వస్తుంది. రేషన్‌ షాపులు ఎప్పుడు తీస్తారో తెలియని పరిస్థితులు గతంలో చూశాం. కూలీ చేసుకునేవారు సాయంత్రం సమయంలో షాపులకు వెళతారు, అయితే ఆ సమయంలో షాపులు మూసివేస్తే రేషన్‌ తీసుకునే అవకాశం కనిపించదు.

– మేర్నీడి సత్యవతి, వాకాడ, కరప మండలం

రేషన్‌ బియ్యాన్ని ఎత్తివేసినా ఆశ్చర్యపోనక్కరలేదు

చంద్రబాబు ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ డోర్‌ డెలివరీ విధానం రద్దు చేయడం అన్యాయం. దూరంగా ఉన్న రేషన్‌ డిపోలకు వెళ్లి క్యూలో నిలబడి రేషన్‌ తెచ్చుకోవాలి. దినసరి కూలీ చేసుకునే వారికి కష్టకాలమే. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కిలో 2 బియ్యం ఎత్తివేస్తే, 2004లో వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చి పునరుద్ధరించారు. భవిష్యత్‌లో రేషన్‌ బియ్యాన్ని ఎత్తివేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.

– రావూరి వెంకటేశ్వరరావు,

రమణయ్యపేట, కాకినాడ రూరల్‌

పడిగాపులు తప్పవు

ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో ప్రజలు రేషన్‌ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వుంది. రేషన్‌ షాపులో తూకాలలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎండీయూ వాహనం వద్ద ఎదురుగానే ఎలక్ట్రానిక్‌ కాటాతో తూకం వేయడంతో తేడా వచ్చేది కాదు. వినియోగదారులు రేషన్‌ షాపునకు వెళ్లిన సమయంలో డీలర్‌ ఉంటారో లేదో తెలియని పరిస్థితి

– రేలంగి వెంకటలక్ష్మి, వీకే రాయపురం, సామర్లకోట మండలం

బలహీనవర్గాలను రోడ్డున పడేస్తున్నారు

ఎండీయూ వాహనాల రద్దుతో 95 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆపరేటర్లను రోడ్డున పడేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగా తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఇచ్చే బియ్యం, కందిపప్పు ఇంటింటికీ చేరవేసే ఎండీయు వ్యవస్థను రద్దు చేయడం దుర్మార్గం. ఎండీయూ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ఎండియూ ఆపరేటర్లు చేసే ఆందోళనలకు మా పార్టీ మద్దతుగా నిలుస్తుంది.

– అల్లి రాజబాబు, వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు1
1/5

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు2
2/5

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు3
3/5

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు4
4/5

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు5
5/5

బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement