
ఆ ఇద్దరి వల్లే రాష్ట్రం దివాళా
తుని: రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడే కారణమని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. బుధవారం తుని మండలం ఎస్.అన్నవరం క్యాంపు కార్యాలయంలో రాజా మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం తునిలో జరిగిన మినీ మహానాడులో యనమల రామకృష్ణుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన ఏకవచన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మద్యం పాలసీలో జగన్‌మోహన్‌రెడ్డికి రూ.3,200 కోట్లు వెళ్లాయని చెప్పడం, ఎల్లో మీడియాలో విస్తృత ప్రచారం చేయడం వెనుక టీడీపీ ఉందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2019లో జగన్‌మోహన్‌రెడ్డి లిక్కర్‌ను ఎంకరేజ్ చేయనని చెప్పారని, లిక్కర్ ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచారన్నారు. మద్యం అమ్మకాలు తగ్గి రాష్ట్రానికి ఆదాయం పెరిగిందని, ఇటువంటి సమయంలో స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రాన్ని దివాళా స్థాయికి తీసుకువచ్చారని, 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి రూ.100 కోట్లతో అప్పగించినట్టు చెప్పారని గుర్తు చేశారు. అప్పుల గురించి గాలి పోగు చేసి మాట్లాడుతున్న టీడీపీ నాయకులు ఏడాది పాలనలో రూ.3లక్షల కోట్లు అప్పు చేసి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబునాయుడు 15 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అప్పు ఎంత? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత అప్పు ఉందని లెక్కలు చూసి మాట్లాడాలని రాజా సూచించారు. రాష్ట్రంలో వేధింపుల రాజకీయం, రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఇందుకు వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపైన వేల సంఖ్యలో పోలీసులతో కేసులు పెట్టించారన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి నాయకులను, కార్యకర్తలను దూరం చేసేందుకు టీడీపీ యత్నిస్తోందని, దీనికి భయపడేదిలేదని అన్నారు. మీరు ఏది చేస్తున్నారో భవిష్యత్‌లో అదే జరుగుతుందన్నారు. చంద్రబాబు నిరపరాధి అని కోర్టు బెయిల్ ఇవ్వలేదని, అనారోగ్యం కారణంగానే బెయిల్ వచ్చిందన్న విషయాన్ని మరచిపోవద్దన్నారు. కేసుల పేరుతో కాలయాపన చేయకుండా పాలన గాడిలో పెట్టేందుకు పని చేయాలని సూచించారు.
యనమల సొంత ఊరు ఏవీ నగరంలో విద్యార్థులకు చదువుకోవడానికి ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర కేబినెట్‌లో కీలక మంత్రి పదవులు చేసిన యనమల ఎందుకు విద్యను ప్రోత్సహించలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక నాడు–నేడులో అన్ని వసతులతో కూడిన స్కూల్‌ను నిర్మించామని, టీడీపీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతున్నా ప్రారంభం చేయలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు తీర ప్రాంత ప్రజలకు పారిశ్రామిక సంస్థల నుంచి రూ.15 వేలు ఇప్పిస్తామని చెప్పి రేషన్‌కార్డులను తీసుకుని మోసం చేశారన్నారు. విజయవాడలో బుడమేరు వాగు పొంగిన ఘటనలో రూ.300 కోట్లు ఖర్చు చేసి వరద బాధితులకు పులిహోర పంపిణీ చేశామని చంద్రబాబు చెప్పుకున్నారని, తునిలో ఇదే రీతిలో 11 నెలల్లో రూ.170 కోట్లు అభివృద్ధి చేశామంటూ చెప్పడం చూస్తే దొందూ దొందేనన్న చందంగా ఉందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి
చంద్రబాబు, యనమలే కారణం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
దాడిశెట్టి రాజా