అత్యధికంగా కరపలో 71.8 మిల్లీమీటర్ల వర్షపాతం
కాకినాడ సిటీ: జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు సరాసరిన 20.5 ెమిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కరప మండలంలో 71.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా ఏలేశ్వరం మండలంలో 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీ వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పెదపూడి మండలంలో 38.2 మిల్లీమీటర్లు, శంఖవరం 30.2, జగ్గంపేట 29.2, తాళ్లరేవు 27, కాజులూరు 24.4, కాకినాడ అర్బన్ 22.4, పెద్దాపురం 18,6 గండేపల్లి 17.2, రౌతులపూడి 16.4, కిర్లంపూడి 15.4, తొండంగి 15.2, గొల్లప్రోలు 14.8, తుని 14.8, ప్రత్తిపాడు 14, కాకినాడ రూరల్ 14, పిఠాపురం 12, యు కొత్తపల్లి 11.8, కోటనందూరు 8.8, సామర్లకోట 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈఏపీ సెట్‌కు
95.83 శాతం హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీఈఏపీ సెట్–25 ఆన్‌లైన్ పరీక్షలు బుధవారం మూడవ రోజు కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు ఆన్‌లైన్ కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి నిర్వహించిన పరీక్షకు 1,719 మంది హాజరుకాగా 64 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పరీక్షకు 851 మంది హాజరుకాగా 37మంది, మధ్యాహ్నం పరీక్షకు 868మంది హాజరుకాగా 27మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ వీ.వీ.సుబ్బారావు తెలిపారు.
పార్టీ తప్పిదం వల్లనే
కార్యకర్తల్లో అసహనం
– టీడీపీ కాకినాడ రూరల్
మినీ మహానాడులో జ్యోతుల నవీన్
కాకినాడ రూరల్: తెలుగుదేశం పార్టీ తప్పిదం వల్ల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికల ముందు నుంచి ఇన్‌చార్జిని ప్రకటించాలని కార్యకర్తలు మొర పెట్టుకుంటున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద స్పందన ఫంక్షన్ హాలులో బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడును నిర్వహించారు. పరిశీలకుడిగా శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూరి సత్తిబాబు హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ కాకినాడ రూరల్‌లో జనసేన ఎమ్మెల్యేను నెగ్గించుకున్నామని, ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రతా వైఫల్యంతోనే
ఉగ్రవాదుల చొరబాటు
అమలాపురం టౌన్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పారా మిలటరీ దళాలు, లోకల్ పోలీసులు, ఎల్‌ఓసీతో పాటు పలు రకాల కేంద్ర ప్రభుత్వ నిఘా ఏజెన్సీల నిరంతర పర్యవేక్షణ ఉన్నప్పుడు పహల్గామ్‌లోకి ఉగ్రవాదుల చొరబాటు భద్రతా వైఫల్యంతోనే జరిగిందని ఏఐసీసీ ఆహ్వాన కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిలల్లా అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రుద్రరాజు మాట్లాడారు. ఇంతటి భద్రతా వలయాలను దాటుకుని ఉగ్రవాదులు ఎలా వచ్చారు. ఎలా మట్టుపెట్టారు అనే దానిపై దేశ ప్రజలు ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. ఇన్ని కోణాల్లో భద్రతా వైఫల్యం వల్లే పహల్గామ్‌లో ఉగ్రవాదులు చొరబడి పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. అందుకు కారణమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పహల్గామ్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దేశ ప్రజలకు, ప్రతిపక్షాలకు వివరణ ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మోదీ గత 11 సంవత్సరాల్లో 176 దేశాల్లో పర్యటించి ఆయా దేశాలతో సత్ సంబంధాలు మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. అయితే పహల్గామ్ ఘటన అనంతరం అనివార్యమైన యుద్ధ సమయంలో ఏ ఒక్క దేశం కూడా మన దేశానికి మద్దుతు ఇచ్చేందుకు ముందుకు రాలేదంటే దేశ ప్రజలు ఆలోచించాలని రుద్రరాజు అన్నారు. సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీను, రాష్ట్ర అధికార ప్రతినిధి వంటెద్దు బాబి, ఏఐసీసీ సభ్యుడు యార్లగడ్డ రవీంద్ర పాల్గొన్నారు.


