
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.55 కోట్లు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 26 రోజులకు గాను రూ.1,55,04,639 ఆదాయం వచ్చింది. హుండీల ఆదాయం బుధవారం లెక్కించారు. ఈ కానుకల్లో నగదు రూ.1,46,96,779, చిల్లర నాణేలు రూ.8,07,860 వచ్చాయని చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. బంగారం 48 గ్రాములు, వెండి 730 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. రోజుకి సరాసరి రూ. 5,96,332 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. అమెరికా డాలర్లు 184, కెనడా డాలర్లు 15, సింగపూర్ డాలర్లు రెండు, ఇంగ్లాండ్ పౌండ్లు ఐదు, స్కాట్‌లాండ్ పౌండ్లు పది, కువైట్ దీనార్లు 20, యూఏఈ దీరామ్స్ 25, ఖతార్ రియాల్స్ పది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహరెన్ దీనార్ ఒకటి లభించాయి. వేసవి సెలవులు, వివాహాలు, ఈ నెల ఏడో తేదీ నుంచి 13 వ తేదీ వరకు సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు కారణంగా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వీరంతా కానుకలు వేయడంతో భారీగా హుండీ ఆదాయం సమకూరింది. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్‌రావు లెక్కింపులో పాల్గొన్నారు.