
ప్రతిష్టాత్మకంగా సాహితీ సంబరాల ఈవెంట్
సఖినేటిపల్లి: శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీలలో ఏలూరులో రెండు వేల మంది కవులు, కళాకారులతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు ఏర్పాటు చేసినట్టు వేదిక సీఈఓ కత్తిమండ ప్రతాప్ అన్నారు. గురువారం సఖినేటిపల్లిలో ఈ మేరకు ఆయన ఈవెంట్‌లో ప్రదర్శించే వివిధ కళల ప్రదర్శనల బ్రోచర్ విడుదల చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సాహితీ సంబరాలలో ఏ విధమైన ఫీజులు లేకుండా పాల్గొనే కవులు, కళాకారులు అందరినీ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో సత్కరించనున్నట్టు వెల్లడించారు. కాగా సాహితీ చరిత్రలో అతి పెద్ద కార్యక్రమంగా రూపొందించిన ఈ ఈవెంట్‌ను కన్వీనర్‌లు కొల్లి రమావతి, డాక్టర్ పార్థసారధి, జి.ఈశ్వరీ భూషణం పర్యవేక్షిస్తారన్నారు. ఈవెంట్‌లో తెలుగు కవితోత్సవం, తెలుగు సాహిత్య సదస్సు, పుస్తకావిష్కరణలు, రంగస్థల ప్రదర్శనలు, జానపద కళలు, కూచిపూడి, భరతనాట్యం వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్టు ప్రతాప్ పేర్కొన్నారు.