
టైలరింగ్ శిక్షణ పేరుతో భారీ స్కామ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ)/పిఠాపురం: ఈబీసీ, బీసీ మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీ పేరుతో రూ.245 కోట్లు స్కామ్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు ఆరోపించారు. కాకినాడ, పిఠాపురంలోని పార్టీ కార్యాలయాల్లో మంగళవారం ఆయన వేరువేరుగా నిర్వహించిన విలేకర్ల సమావేశాల్లో మాట్లాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చిన సర్కారు.. దీనిలో భాగంగా ఈ స్కామ్‌కు తెర తీసిందన్నారు. సుమారు 1.02 లక్షల మంది బీసీ మహిళలకు ఒక్కొక్కరికి రూ.23 వేలు కేటాయించిందన్నారు. ఇందులో కుట్టు మెషీన్ మిషన్ కొనుగోలుకు రూ.4,300, మహిళల శిక్షణకు రూ.3 వేలు కలిపి ఒక్కో మహిళకు రూ.7,300 ఖర్చు చేయనున్నట్లు ప్రకటించిందన్నారు. ఈవిధంగా లక్ష మంది మహిళలకయ్యే ఖర్చు సుమారు రూ.73 కోట్లు మాత్రమేనని, మిగిలిన రూ.167 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్ వేశారని చెప్పారు. ఈబీసీ మహిళల పేరిట కూడా రూ.115 కోట్లు కొట్టేసేందుకు పన్నాగం పన్నుతున్నారన్నారు. ఈ పథకంలోనే రూ.కోట్లు కాజేస్తున్న కూటమి నేతలు.. అమరావతి గ్రాఫిక్స్ పేరిట ఎన్ని వేల కోట్లు తినేసేందుకు సిద్ధమవుతున్నారో తెలియదన్నారు. పోలవరంలోనూ వేలాది కోట్ల స్కామ్‌కు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు ఈ విషయాలను గ్రహించాలని కోరారు. బీసీ ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం బీసీ మహిళలకు కేటాయించిన కోట్లాది రూపాయిలు అక్రమంగా దోచుకుంటున్న విషయం అందరూ చూస్తున్నారని రాజబాబు అన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి అనసూయ ప్రభాకర్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు చెక్క చక్రవర్తి, మత్స్యకార నాయకుడు వాసుపల్లి కృష్ణ, పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ బెజవాడ బాబీ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు గండేపల్లి బాబీ, పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు రావుల మాధవరావు పాల్గొన్నారు.