జల్సాల కోసం బైకుల చోరీలు | - | Sakshi
Sakshi News home page

జల్సాల కోసం బైకుల చోరీలు

Mar 24 2025 6:34 AM | Updated on Mar 24 2025 6:33 AM

నిందితుడి అరెస్టు

31 వాహనాల స్వాధీనం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చెడు వ్యసనాలు, జల్సాల కోసం ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న నిందితుడిని ప్రకాష్‌ నగర్‌ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీస్‌ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ రమేష్‌బాబు, సీఐ బాజీలాల్‌, ఎస్సై శివప్రసాద్‌ ఈ వివరాలు తెలిపారు. నల్లజర్ల మండలం మర్లపూడి గ్రామానికి చెందిన తూర్ల సోమయ్య ప్రస్తుతం రాజమహేంద్రవరం మంగళవారపేటలో నివాసం ఉంటున్నాడు. అతడు చెడు వ్యసనాలు, తిరుగుళ్లకు బానిసయ్యాడు. తన జల్సాలకు అవసరమైన డబ్బుల కోసం బైకులు దొంగతనం చేసేవాడు. అలా దొంగిలించిన బైకులను నల్లజర్ల మండలం జగన్నాథపురానికి చెందిన చీర్ల కిషోర్‌ ద్వారా తక్కువ ధరకే విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. రాజమహేంద్రవరంలో ఇటీవల బైకు దొంగతనాలు ఎక్కువగా జరుగుతూండటంతో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ ఆదేశాల మేరకు.. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్ల సోమయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా బైకు చోరీల చిట్టా బయట పడింది. దొంగిలించిన బైకులు విక్రయించడానికి సహకారం అందించిన చీర్ల కిషోర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం, కోరుకొండ, ఏలూరు, విజయవాడ ప్రాంతాల్లో నిందితుడు చోరీ చేసిన 31 బైకులు రికవరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.16 లక్షలుంటుందని సీఐ బాజీలాల్‌ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ బాజీలాల్‌, ఎస్సై శివప్రసాద్‌, క్రేన్‌ కానిస్టేబుళ్లు కె.ప్రదీప్‌ కుమార్‌, ఎస్‌.వీరబాబు, వి.శివప్రసాద్‌లను ఎస్పీ అభినందించారు. ద్విచక్ర వాహదారులు తమ బైకుల రక్షణకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ రమేష్‌బాబు కోరారు. హ్యాండిల్‌ లాక్‌తో పాటు, ఫోర్క్‌ లాక్‌ ఉపయోగిస్తే బైకు దొంగతనాలను కొంతమేరకు అరికట్టవచ్చన్నారు. ప్రస్తుతం మార్కెట్లో అధునాతన తాళాలు వచ్చాయని, వాటిని ఉపయోగించడం ద్వారా బైకులకు మరింత రక్షణ లభిస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement